Medaram Jatara 2026: మరికొన్ని రోజుల్లో మొదలుకానున్న మేడారం జాతర-2026కు (Medaram Jatara 2026) సంబంధించిన పనులు, ఏర్పాట్లను మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మేడారం పునరుద్ధరణ శాశ్వత నిర్మాణ పనులపై సీతక్క మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమ్మక్క సారలమ్మ తల్లులతో ఎంతో భావోద్వేగ బంధం ఉందని, అందుకే, రూ.260 కోట్లతో మేడారం అభివృద్ధి పనులు చేపట్టారని ప్రస్తావించారు. మేడారం గుడిని ప్రారంభించేందుకు ఈ నెల 18న ముఖ్యమంత్రి అక్కడకి వస్తున్నారని, అక్కడే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని మంత్రి సీతక్క వెల్లడించారు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వమే అక్కడికి తరలి వస్తుందని వ్యాఖ్యానించారు.
త్వరితగతిన దర్శనం జరిగేలా చూడాలి
భక్తులకు త్వరితగతిన తల్లుల దర్శనం జరిగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సీతక్క సూచించారు. సంప్రదాయ భక్తులు కనీస 3 రోజులపాటు మేడారంలోనే బస చేస్తారని, కాబట్టి వారికి అవసరమైన వసతులు అన్నింటిని కల్పించాలని ఆదేశించారు. రవాణా, తాగునీరు, శానిటేషన్ సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసులు పర్యవేక్షణ చేయాలన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులు ఆర్టీసీ బస్సుల్లో వస్తారు కాబట్టి, ఆర్టీసీ అధికారులు ఆ రూట్లలో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. సమ్మక్క సారలమ్మ మహా మేడారం జాతరను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగానే ఆలయాన్ని పూర్తి చేశామన్నారు. మరో వెయ్యేళ్ల పాటు నిలిచేలా మేడారం ఆలయం నిర్మితమైందని సీతక్క హర్షం వ్యక్తం చేశారు. విస్తరించిన రోడ్లు, అపురూపంగా రూపుదిద్దుకున్న జంక్షన్లు, ఆదివాసి చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆమె వివరించారు.
Read Also- Mahesh Kumar Goud: శ్రీరాముడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా?: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్
2 కోట్ల మంది వస్తారని అంచనా
సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలో అతిపెద్దదని మంత్రి సీతక్క అన్నారు. ఈ జాతరకు అన్ని వర్గాల ప్రజలు తల్లుల దర్శనం కోసం విచ్చేస్తారని పేర్కొన్నారు. రెండు కోట్ల భక్తులు జాతరకు వస్తారని అంచనాగా ఉందని, అన్ని శాఖల సమన్వయం చేస్తున్నామని ఆమె చెప్పారు. జాతర ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.

