CM Revanth Reddy: ట్రాఫిక్ నిబంధనలకు నీళ్లొదులుతూ రహదారులపై రయ్యిన దూసుకుపోతున్నారా? సంవత్సరం ఆఖరులో డిస్కౌంట్ ఆఫర్ వచ్చినపుడు జరిమానాలు చెల్లించొచ్చు అని భావిస్తున్నారా? ఇకపై ఆ పప్పులు ఉడకవు. చలానా పడిన వెంటనే నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారుని బ్యాంక్ ఖాతా నుంచి నగదు కట్ కానుంది. పోలీసు శాఖ అకౌంట్ లోకి జమ కానుంది. ఈ దిశగా రవాణా శాఖ, ఆయా బ్యాంకులతో సమన్వయం ఏర్పరుచుకుని కార్యాచరణను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు.
లక్షల్లో వాహనాలు
అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే 94.78 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటికి అదనంగా వేర్వేరు రాష్ట్రాల నుంచి ప్రతీరోజూ వేల సంఖ్యలో వాహనాలు రాష్ట్ర రహదారుల మీదుగా ప్రయాణిస్తున్నాయి. అంతే సంఖ్యలో ఉల్లంఘనలు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనదారుల సంఖ్య కూడా లక్షల్లో ఉంటోంది. గత సంవత్సరం ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ ధరించనందుకు నమోదైన కేసులు 41.28లక్షలు ఉన్నాయి. ఇక, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు సంబంధించి 6.07 లక్షల కేసులు నమోదు కాగా, ఓవర్ స్పీడ్/డేంజరస్ డ్రైవింగ్ కు సంబంధించి 2.34 లక్షల కేసులు రిజిష్టర్ అయ్యాయి. ట్రిపుల్ రైడింగ్ కేసులు 1.75లక్షలు నమోదు కాగా, సిగ్నల్ జంపింగ్ కేసులు 1.52లక్షలు రిజిష్టరయ్యాయి. ఓ చేత్తో సెల్ ఫోన్ పట్టుకుని వాహనాలను డ్రైవింగ్ చేసినందుకు 1.26లక్షలు, పీకలదాకా మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు 49,732 కేసులు నమోదయ్యాయి. సీటు బెల్టు పెట్టుకోకుండా కార్లను నడిపిన 39,944మంది, పరిమితికి మించి ప్రయాణీకులను వాహనాల్లో ఎక్కించుకున్నందుకు 11,329మందికి జరిమానాలు విధించారు. ఇక, వాహనాలు నడుపుతూ 7,808మంది మైనర్లు పట్టుబడ్డారు.
Also Read: CM Revanth Reddy: గుండె వ్యాధులు నివారించే మిషన్‌తో పని చేద్దాం: సీఎం రేవంత్ రెడ్డి
యాక్సిడెంట్లకు కారణాలివే
ఇలా అన్నిరకాల ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలు నడుపుతున్న వారి కారణంగానే 95శాతానికి పైగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. మరెంతోమంది శాశ్వత అంగవికలురుగా మారి జీవచ్ఛవాల్లా బతుకులు వెళ్లదీస్తున్నారు. ఏడాది ఆఖరులో చూసుకుందాంలే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా పక్కాగా ఆధారాలు సేకరించి ఫోటోలతో సహా వాహనదారుల ట్రాఫిక్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇక, తనిఖీలు జరుపుతున్నపుడు హ్యాండ్ హెల్డ్ డివైజ్ ల ద్వారా ఆయా వాహనాలపై ఎన్ని చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి? అన్నది తెలుసుకుంటున్నారు. రెండు మూడుకన్నా ఎక్కువగా ఉంటే జరిమానా మొత్తాన్ని అక్కడికక్కడే వసూలు చేస్తున్నారు. లేనిపక్షంలో వాహనాలు సీజ్ చేస్తున్నారు. అయితే, ఉల్లం‘ఘనుల’ సంఖ్య లక్షల్లో ఉంటుంటే ఇలా దొరుకుతున్నవారి సంఖ్య వేలల్లోనే ఉంటోంది. చాలామంది వాహనదారులు ఏడాది ఆఖర్లో పోలీసు శాఖ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించినపుడు జరిమానాలు చెల్లిద్దామన్న ధోరణిలోనే ఉంటున్నారు.
ఇకపై అలా కుదరదు
అయితే, ఇలా ఎంతమాత్రం కుదరదు. యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన అరైవ్…అలైవ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానా పడిన వెంటనే వారి ఖాతాల్లో నుంచి జరిమానా మొత్తం కట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు. దీని కోసం వాహనాలను రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే యజమాని బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకోవాలన్నారు. ఆయా బ్యాంకులతో సమన్వయాన్ని కుదుర్చుకుని ఈ విధానం అమలయ్యేట్టు చూడాలని చెప్పారు. జరిమానాలు వసూలు చేసే విషయంలో ఒక్క రూపాయి కూడా డిస్కౌంట్ ఇవ్వొద్దని సూచించారు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఈ విధానాన్ని అమలు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై.. సీఎం కీలక నిర్ణయం!

