Hyderabad West Lands | మాదాపూర్, గచ్చిబౌలి, కోకా పేట్! ఐటీ కంపెనీలకు హాట్ స్పాట్లు! హైదరాబాద్‌లోని మెజార్టీ ఐటీ కంపెనీలు ఇక్కడే కొలువుదీరాయి. దీంతో ఇక్కడ భూముల లభ్యత తగ్గిపోయింది. కానీ, ఇటీవల దావోస్‌లో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న పలు ఐటీ, డాటా సెంటర్ కంపెనీలు ఇదే వెస్ట్ ఏరియాలో తమ సంస్థలను నెలకొల్పడానికి ఆసక్తి చూపుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఆయా కంపెనీలకు భూములను వెతికి పెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణావసరంగా మారింది.
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: దావోస్ వేదికగా రాష్ట్రానికి రూ.1.82 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డాటా సెంటర్లను ఏర్పాటు చేసే కంపెనీలు హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంవైపే ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే అక్కడ పలు కంపెనీలు పనిచేస్తుండటంతో ఇకపైన కొత్త యూనిట్లకు కూడా ఆ ప్రాంతమే ప్రయారిటీగా మారింది. ఈ కంపెనీల అవసరాలకు, ఉద్యోగుల రాకపోకలకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు, మెట్రో రైల్ కనెక్టివిటీని పెంచింది. దీంతో ఆ ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు మెరుగయ్యాయి.
తాజాగా పలు డాటా సెంటర్ల కంపెనీలు హైదరాబాద్‌లో కొత్త యూనిట్లను నెలకొల్పడానికి, ఇప్పటికే ఉన్నవాటిని విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అయితే.. తమ కంపెనీల ఏర్పాటుకు పశ్చిమ ప్రాంతమే (Hyderabad West Lands) బెస్ట్ గా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయని సమాచారం.
సర్కార్‌కు సవాల్!
ఒకవైపు విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని సంతోషపడుతున్నా వాటికి మాదాపూర్ మొదలు గచ్చిబౌలి, కోకాపేట్ వరకు భూములను సమకూర్చడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ప్రభుత్వ భూములు పరిమితంగానే ఉండటంతో కొత్త కంపెనీలకు సమీకరించడం సంక్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా వెస్ట్ ప్రాంతంలోని భూములకు డిమాండ్ తగ్గిపోయిందని, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీ ప్లాన్‌తో దక్షిణం వైపు భూ క్రయవిక్రయాలు పెరిగాయని రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒక అభిప్రాయం నెలకొన్నది.
ఇప్పుడు కొత్త కంపెనీల ఏర్పాటుతో మరోసారి వెస్ట్ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చే అవకాశమున్నది. రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం పూర్తయ్యి వినియోగంలోకి వస్తే ప్రైవేటు భూముల విక్రయం ఊపందుకుంటుందని, భూసేకరణ సమస్య ఉండకపోవచ్చన్నది ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. ఒప్పందాలను అమల్లోకి తెచ్చే క్రమంలో భూముల సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించింది.
సగటున ఐదు నుంచి పదెకరాలు అవసరం!
దావోస్‌లో ప్రభుత్వం కుదుర్చుకున్న ఇరవైకు పైగా అవగాహన ఒప్పందాల్లో పన్నెండు ఐటీ, డాటా సెంటర్లకు సంబందించినవే. ఈ కంపెనీలన్నీ హైదరాబాద్ వెస్ట్ ప్రాంతం (Hyderabad West Lands)లో యూనిట్లను స్థాపించాలనే కోరుకుంటున్నాయి. ఒక్కో డాటా సెంటర్‌కు వాటి సామర్థ్యాన్నిబట్టి సగటున ఐదు నుంచి పది ఎకరాల స్థలం అవసరమవుతుందని పరిశ్రమల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా పేర్కొన్నారు.
దీంతో పన్నెండు డాటా సెంటర్లకు ప్రభుత్వం తగిన స్థలాన్ని ఆ ప్రాంతంలో ఎంపిక చేసి అప్పగించడం తక్షణావసరంగా మారింది. రెవెన్యూ శాఖ సహకారంతో ప్రభుత్వ భూముల్ని గుర్తించడం, అందుబాటులో ఉంటే వెంటనే అప్పగించడం, లేనిపక్షంలో ప్రైవేటు భూములను కొనుగోలు చేసి సమకూర్చడం.. ఇలాంటి చర్యలు తప్పవని ప్రభుత్వం భావిస్తున్నది.
ద్వితీయ శ్రేణి పట్టణాల అభివృద్ధిపై ఫోకస్
దీర్ఘకాలంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఎక్కువగా హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోనే కేంద్రీకృతం కావడంతో ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా వరంగల్‌ను సెకండ్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దడంపై మంత్రులు పలు సందర్భాల్లో భవిష్యత్తు ప్రణాళికను వివరించారు.
దీనికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ సైతం డాటా సెంటర్లు, ఐటీ పరిశ్రమల స్థాపన విషయంలో వరంగల్, మరికొన్ని పట్టణాలను ఆయా కంపెనీలు ఎంచుకునేలా ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగమే సిఫీ టెక్నాలజీస్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వరంగల్ లేదా మరో నగరంలో కూడా ఐటీ, డాటా సెంటర్ యూనిట్లను నెలకొల్పడంపై చర్చించారు. అందుకు ఆ కంపెనీ కూడా సానుకూలంగా స్పందించింది. రానున్న రోజుల్లో ఇతర రంగాల్లోనూ సెకండ్ టైర్ సిటీస్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నది.
ఐటీ పాలసీకి సవరణలు!
ఐటీ రంగంలో దేశ, విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు వీలుగా గత ప్రభుత్వం రూపొందించిన ఐటీ పాలసీకి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేయాలని భావిస్తున్నది. ఐటీ పరిశ్రమల స్థాపనతో ఉద్యోగుల రోజువారీ వినోదం, షాపింగ్ లాంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని షాపింగ్ మాల్స్ నిర్మాణంపైనా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. ఇప్పటికే వెస్ట్ ప్రాంతంలో చాలా వెలిసినందున ఇకపైన నగరానికి నార్త్, సౌత్, ఈస్ట్ ప్రాంతాల్లోనూ ఇలాంటివాటి నిర్మాణంపై దృష్టి పెట్టింది. గచ్చిబౌలిలోని అవతార్ టవర్స్ తరహాలో హకీంపేట్‌లో కూడా టవర్ల నిర్మాణంపై ఆలోచిస్తున్నది.