Ramagundam: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కలిసి రూ. 175 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గోదావరిఖని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా 50 మంది ట్రాన్స్‌జెండర్లకు ఇళ్ల పత్రాలను అందజేశారు. వీరితో పాటు 586 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, 494 మందికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇళ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని, ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లు నిర్మిస్తున్నామని భట్టి ప్రకటించారు.
కోటి రూపాయల బీమా
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం లభించిందని, త్వరలోనే ప్లాంట్ ప్రకటన ఉంటుందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. సింగరేణి ఉద్యోగులకు అమలు చేస్తున్న కోటి రూపాయల ప్రమాద బీమాను, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంలోని 5.14 లక్షల రెగ్యులర్ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో పేదలపై ఆర్థిక భారం తగ్గిస్తున్నామని మంత్రులు వివరించారు. సింగరేణి పరివాహక ప్రాంతంలో 76 జీవో వల్ల నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్‌ను పాతరేస్తున్నారు
అవినీతి ప్రభుత్వాన్ని పాతరేసి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రజలు, అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తూ బీఆర్ఎస్‌ను అడ్రస్ లేకుండా చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. సొంత ఇంటి ఆడబిడ్డకే న్యాయం చేయలేని నాయకులు తెలంగాణ మహిళలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో ప్రజలను పట్టించుకోని నేతలు ఇప్పుడు ప్రజా పాలనను విమర్శించడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, శంకుస్థాపనలు చేశారు.
Also Read: Industrial Power Bills: పరిశ్రమలపై పెరిగిన విద్యుత్ బిల్లులు.. ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

