MPTC Elections: కాంగ్రెస్ పార్టీలో మరో ట్విస్ట్ నెలకొన్నది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన లీడర్లు ఎంపీటీసీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల కంటే ముందు ముఖ్య నేతలంతా ఈ తరహా హామీలు ఇచ్చారంటూ ఆయా లీడర్లు గుర్తు చేస్తున్నారు. తాము ఏళ్ల తరబడి నుంచి పార్టీలో పని చేస్తున్నామని, కానీ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ రెబల్స్ కారణంగా ఓడిపోవాల్సి వచ్చిదంటూ ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ, మెదక్ జిల్లాలకు చెందిన కొందరు నేతలు పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. రెబల్స్ లేకుంటే తప్పనిసరిగా గెలిచేవాళ్లమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి నుంచి పని చేసిన వాళ్లకు మరో అవకాశం ఇవ్వాలని ఆయా లీడర్లంతా ఓ టీమ్‌గా ఏర్పడి పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. గాంధీభవన్‌కు లేఖ కూడా రాసినట్లు తెలిసింది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం ఆయా లీడర్లు ప్రయత్నం చేస్తున్నారు. వారిని కన్విన్స్ చేయాలని సీనియర్లు భావిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ కొత్త లొల్లి
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ, పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన అభ్యర్థులు ఇప్పుడు తమకు ఎంపీటీసీలుగా అవకాశం కల్పించాలని పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావడం హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ కార్యాలయానికి వారి నుంచి విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలు తలలు పట్టుకోవాల్సి వస్తున్నది. సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ, ఈ కొత్త సమస్యకు ఎలా చెక్ పెట్టాలని సతమతమవుతున్నారు. అసంతృప్తి లీడర్లను సమన్వయం చేయడం పార్టీకి సవాల్‌గా మారింది. ఈ అంశంపై పీసీసీ చీఫ్ కూడా సీఎంతో ప్రత్యేకంగా మాట్లాడాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Also Read: CM Revanth Reddy: గుండె వ్యాధులు నివారించే మిషన్‌తో పని చేద్దాం: సీఎం రేవంత్ రెడ్డి
7 వేలకు పైగా..
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా 7 వేలకుపైగా స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ, కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో ఓటమి ఎదురైంది. ప్రస్తుతం గెలిచిన సర్పంచులు తమ పరిధిలోని ఎంపీటీసీ స్థానాల్లో తమ అనుచరులకు టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతుండగా, పార్టీ మద్దతుతో ఓడిపోయిన అభ్యర్థులు కూడా తమకూ ఆయా స్థానాల్లో ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు తమకు సానుభూతి ఉన్నదని, ఎంపీటీసీగా గెలిచి పార్టీ బలాన్ని నిరూపిస్తామని ప్రతిపాదనలు పెడుతున్నారు. మరోవైపు స్థానిక కోటా, కుల సమీకరణాల దృష్ట్యా పాత అభ్యర్థులకే ఇవ్వాలా, లేదా కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అనేది పార్టీకి ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఓడిన వారికి ప్రాధాన్యత ఇస్తే, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతున్నది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పోరాడి ఓడిపోయిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం బాధ్యత అని కొందరు అంటుంటే, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు. ఇలా ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి, ఈ అంతర్గత పోటీ ఒక పరీక్షగా మారింది. పార్టీ పెట్టుకున్న 90 శాతం లక్ష్యాన్ని చేరేందుకు ముఖ్య లీడర్లు అంతర్గతంగా సమలోచనలు చేస్తున్నారు.
Also Read: Industrial Power Bills: పరిశ్రమలపై పెరిగిన విద్యుత్ బిల్లులు.. ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

