Sathupally News: దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక మోసాల నేపథ్యంలో, సత్తుపల్లి కేంద్రంగా విస్తరించిన భారీ ఆర్థిక నెట్‌వర్క్ కేసు వెలుగులోకి వచ్చింది. సైబర్ క్రైమ్ విచారణలో భాగంగా గుర్తించిన బ్యాంకు లావాదేవీలు, మ్యూల్ అకౌంట్లు, మధ్యవర్తుల పాత్రలు వందల కోట్ల రూపాయల అక్రమ ఆర్థిక ప్రవాహాన్ని బయటపెడుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో నమోదైన సైబర్ నేరాలకు సంబంధించి, సైబర్ క్రైమ్ విభాగం చేపట్టిన విచారణలో కీలక ఆధారాలు లభించాయి. నకిలీ క్రెడెన్షియల్స్, ATM కార్డులు, బ్యాంకు ఖాతాల దుర్వినియోగం ద్వారా భారీ మొత్తాలు అక్రమంగా తరలించబడినట్లు అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలు కేవలం ఒక వ్యక్తి లేదా ఒక ఖాతాకు పరిమితం కాకుండా, ఒక క్రమబద్ధమైన నెట్‌వర్క్ ద్వారా నిర్వహించబడినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా గుర్తించిన కొన్ని కీలక ఖాతాల్లో భారీ మొత్తాలు జమ అయినట్లు వెల్లడైంది.
వందల కోట్లు గుర్తింపు..
పోట్రూ మనోజ్ కళ్యాణ్ ఖాతాలో – రూ.114.18 కోట్లు,
మేడ భాను ప్రియ (మనోజ్ కళ్యాణ్ భార్య) ఖాతాలో – రూ.40.21 కోట్లు,
మేడ సతీష్ (మనోజ్ కళ్యాణ్ బావ) ఖాతాలో – రూ.135.48 కోట్లు,
బొమ్మిడాల నాగ లక్ష్మి (సత్తుపల్లి) ఖాతాలో – రూ.81.72 కోట్లు,
ఉడతనేని వికాస్ చౌదరి ఖాతాలో – రూ.80.41 కోట్లు లావాదేవీలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు.
నరసింహ కిరాణా అండ్ డైరీ..
అత్యంత కీలకంగా, నరసింహ కిరాణా అండ్ డైరీ, కరీంనగర్ పేరిట ఉన్న ఒక ఖాతా మ్యూల్ అకౌంట్‌గా ఉపయోగించబడినట్లు విచారణలో తేలింది. ఈ ఖాతా ద్వారా మాత్రమే రూ.92.54 కోట్లు లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాతా పై పేర్కొన్న వ్యక్తులందరూ వినియోగించిన సాధారణ ఖాతాగా ఉండటం అనుమానాలను మరింత బలపరుస్తోంది. మొత్తం లావాదేవీల విలువ రూ.547 కోట్లు దాటినట్లు అధికారికంగా వెల్లడైంది. విచారణలో మరో కీలక అంశంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల పేర్లతో తెరవబడిన ఖాతాలు బయటపడ్డాయి. వ్యాపారం, కూలీ, నిరుద్యోగులు, గృహిణులు అనే గుర్తింపులతో ఉన్న ఖాతాలను ఉపయోగించి అక్రమ డబ్బు తరలింపులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సదాశివునిపాలెం, సీతారాంపురం, రామనగరం, తుమ్మూరు వంటి ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తుల పేర్లు ఈ నెట్‌వర్క్‌లో వెలుగులోకి వచ్చాయి. వీరి ఖాతాలు మధ్యవర్తుల ద్వారా నియంత్రించబడి, లావాదేవీలకు మాత్రమే ఉపయోగించబడ్డాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Anvesh Controversy: పరువు మొత్తం పోగొట్టకున్న యూట్యూబర్ అన్వేష్.. ఏం అన్నాడంటే?
ప్రధాన సూత్రధారులు ఎవరు..?
లింగాలపాలెం ప్రాంతానికి చెందిన 22 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులు, కూలీల పేర్లతో కూడా ఖాతాలు తెరవబడినట్లు విచారణలో తేలింది. వీరికి రోజుకు కొన్ని వేల రూపాయల పారితోషికం ఇచ్చి ఖాతాలు వినియోగించుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఖాతాల ద్వారా వచ్చిన డబ్బు వెంటనే ఇతర ఖాతాలకు బదిలీ కావడం, నగదు ఉపసంహరణలు జరగడం గమనార్హం. ఈ అక్రమ లావాదేవీల్లో కొంత మొత్తం విదేశీ కరెన్సీ మార్గాల్లోకి, క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల వైపు మళ్లించబడినట్లు కూడా విచారణాధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కోణంలో ఆర్థిక నేర విభాగాలు లోతైన దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అనేక బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయబడినట్లు, కీలక డిజిటల్ ఆధారాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. లావాదేవీల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు, మధ్యవర్తులు, లాభదారుల పాత్రను నిర్ధారించేందుకు మరింత లోతైన విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారం కేవలం సైబర్ నేరంగా కాకుండా, వ్యవస్థాత్మక ఆర్థిక మోసంగా మారినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తవ్వేకొద్ది బయటపడుతున్న వాస్తవాలు
వందల కోట్ల లావాదేవీలు జరుగుతున్నా బ్యాంకింగ్ వ్యవస్థకు ముందే సంకేతాలు ఎందుకు అందలేదు? మ్యూల్ అకౌంట్లను నియంత్రించిన అసలు సూత్రధారులు ఎవరు? ఈ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ భారీ ఆర్థిక మోసానికి సంబంధించిన వివరాలు ఖమ్మం సీపీ సునీల్ దత్ వీఎం బంజారా పోలీస్ స్టేషన్లో వెల్లడించారు.
Also Read: Palwancha Municipality: పాల్వంచ మున్సిపాలిటీలో ఈసారైనా పోరు జరిగేనా..? అందరి చూపు అటువైపే..!

