తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : ప్రధాని మోడీ ఇటీవల తరచుగా వన్ నేషన్ – వన్ ఎలక్షన్ (One Nation One Election) అనే స్లోగన్‌ను ప్రస్తావిస్తూ ఉన్నారని, కానీ దీని అసలు లక్ష్యం ఒకే వ్యక్తి – ఒకే పార్టీ అని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న ఉద్దేశానికి బదులుగా బీజేపీ మాత్రమే అధికారంలో ఉండాలని, ప్రధానిగా మోడీ ఉండాలన్నదే ఒకే దేశం – ఒకే ఎన్నిక వెనక ఉన్న రహస్య ఎజెండా అని వ్యాఖ్యనించారు.
మలయాళీ దినపత్రి మాతృభూమి కేరళలోని తిరువనంతపురంలో ఆదివారం నిర్వహించిన ‘ఇంటర్‌నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగించే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా లెక్కలు కీలకమైన అంశమని, కుటుంబ నియంత్రణ విధానాన్ని ఉత్తమంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలు ప్రోత్సాహం పొందడానికి బదులుగా వివక్షకు, అన్యాయానికి గురవుతున్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలను మోడీ శిక్షిస్తున్నారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీలను, హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్నారు. తెలంగాణ ఏడాది పాలనలోని విజయాలను సీఎం రేవంత్ ప్రస్తావిస్తూ… ‘తెలంగాణ రైజింగ్’ అనేది కేవలం నినాదమే కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వప్నమన్నారు.
తెలంగాణను ప్రపంచంలోనే అత్యుత్తుమంగా నిలపాలన్నది తమ లక్ష్యమన్నారు. ఈ లక్ష్య సాధనకు దక్షిణాది రాష్ట్రాలు కలిసి పనిచేయాలసిన అవసరాన్ని ఈ వేదిక ద్వారా నొక్కిచెప్పారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని 60 ఏండ్లుగా కొట్లాడారని, ఆ కలను కాంగ్రెస్ నెరవేర్చిందని, సోనియాగాంధీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. గడచిన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం కోసం చేసింది ఏమీ లేకపోగా వాగ్దానాలను తుంగలో తొక్కి అవినీతికి పాల్పడిందన్నారు.
వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా..
తెలంగాణ జీఎస్‌డీపీ ప్రస్తుతం సుమారు 200 బిలియన్ డాలర్లుగా ఉన్నదని, పదేండ్లలో (2035 నాటికి) దాన్ని ఒక ట్రిలియన్ డాలర్లు ఎకానమీగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని సీఎం రేవంత్ (CM Revanth Reddy) పేర్కొన్నారు. ఇది సాకారం కావడానికి రాష్ట్రాన్ని హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే మూడు జోన్లుగా విభజించుకున్నామని, ఒక్కో జోన్‌ను ఒక్కో రంగానికి ఉపయోగపడేలా రోడ్ మ్యాప్‌ను రూపొందించామన్నారు. సిటీ చుట్టూ 160 కి.మీ. పొడవైన ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) ఉన్నదని, కోర్ అర్బన్ ఏరియాగా గుర్తించిన ఈ పరిధిలో సుమారు 1.20 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారని, సాఫ్ట్ వేర్, ఫార్మా రంగాలకు కేంద్రంగా ఉన్నదన్నారు.
హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఒక ఐకాన్‌గా ఉన్నదని, బిర్యానీ, ముత్యాలకు ప్రసిద్ధి చెందిందన్నారు. కోర్ అర్బన్ ఏరియాను సర్వీసు రంగానికి పరిమితం చేసి కాలుష్యం లేకు,డా 100% శాతం ‘నెట్ జీరో సిటీ’గా మార్చనున్నామన్నారు. తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారితే అది దేశ వృద్ధికీ ప్రయోజనమని, దీన్ని గుర్తించి అన్ని రాష్ట్రాలకు మద్దతుగా నిలవాలని కేంద్రాన్ని కోరారు. దక్షిణాది రాష్ట్రాలు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని బీజేపీ విధానాన్ని విమర్శించారు.
ప్రపంచ నగరాలతోనే హైదరాబాద్‌కు పోటీ…
ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ముంబయి, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై లాంటి నగరాలతో కాకుండా న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్‌లతో పోటీపడేలా మారుస్తామన్నారు. దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, ఇది పూర్తిస్థాయిలో గ్రీన్, క్లీన్, బెస్ట్ సిటీగా అవతరిస్తుందన్నారు. దేశంలోనే మొదటి కాలుష్యరహిత నగరంగా మారుతుందన్నారు.
ఈ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్‌ను నిర్మిస్తామని, యువతకు ఉపాధి లభించేలా నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీలను నెలకొల్పుతున్నామన్నారు. దావోస్‌లో గత నెలలో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్‌లో తాను పాల్గొన్నానని, రాష్ట్రానికి రూ. 1.82 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల వచ్చేలా దేశ, విదేశీ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నామన్నారు. గతేడాది రూ. 40 వేల పెట్టుబడులలే వచ్చాయని, గత ప్రభుత్వం పదేళ్లలో గరిష్టంగా రూ. 25 వేల కోట్లనూ సాధించలేకపోయిందన్నారు.
మూసీ ప్రక్షాళనతో త్రివేణీ సంగమం :
హైదరాబాద్ నగర పర్యావరణ సుస్థిరత కోసం మూసీ నదిని ప్రక్షాళన చేసేలా పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టామని, గడచిన యాభై ఏళ్లుగా కాలుష్యం కోరల్లో చిక్కిన ఈ నదికి పూర్వ వైభవం తీసుకురావాలనకుంటున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మూసీ నది కనుమరుగయ్యే ప్రమాదాన్ని నివారించి మూసా, ఈసా, గోదావరి నదులను అనుసంధానించి ‘త్రివేణి సంగమం’గా మార్చడమే కాక దాదాపు 200 ఎకరాల్లో ‘గాంధీ సరోవర్’ను నిర్మిస్తామన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో తీర ప్రాంతం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, అందుకే ఇక్కడ డ్రై పోర్టును నిర్మించి దాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని బందరు ఓడరేవుతో రైలు, రోడ్డు మార్గం ద్వారా కనెక్ట్ చేస్తామన్నారు. ఇలాంటి మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ వృద్ధి చెందితేనే ‘తెలంగాణ రైజింగ్’ నినాదం సాకారమవుతుందన్నారు. ఎప్పుడైనా అభివృద్ధి నగరాలతోనే ప్రారంభమవుతుందని, వేగవంతమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన, అవకాశాలు కల్పించే నగరంగా హైదరాబాద్ మారుతుందన్నారు.
గ్రీన్ ఎనర్జీతో భవిష్యత్తు తరాలకు రక్షణ :CM Revanth Reddy
ఔటర్ రింగు రోడ్డుకు వెలుపల రీజినల్ రింగు రోడ్డును, దాని వెన్నంటే రీజినల్ రింగు రైల్వే లైన్‌ను కూడా నిర్మించబోతున్నామని, ఈ రెండింటినీ రేడియల్ రోడ్ల ద్వారా కలపనున్నామని సీఎం రేవంత్ వివరించారు. ఇటీవలే ‘క్లీన్-గ్రీన్ ఎనర్జీ పాలసీ’ని విడుదల చేశామని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచి కాలుష్యాన్న తగ్గించాలన్న ఉద్దేవంతో ఈవీలపై ప్రస్తుతం ఉన్న అన్ని పన్నులనూ తొలగించామని గుర్తుచేశారు.
ఈ కారణంగా ఈవీల అమ్మకాల్లో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. ఆర్టీసీలోనూ త్వరలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ ఏరియాగా పరిగణించి ఉత్పత్తి (మాన్యుఫ్యాక్‌ారింగ్) జోన్‌గా మార్చబోతున్నామని, ఈ ప్రణాళిక ఇది ‘చైనా ప్లస్ వన్’ అనే వ్యూహానికి మొత్తం ప్రపంచానికే సమాధానంగా ఉంటుందన్నారు.
Also Read : సచివాలయంలో నకిలీ ఉద్యోగులు… అధికారులకు కొత్త సవాల్
గ్రామీణ జోన్‌గా ట్రిపుల్ ఆర్ వెలుపలి ప్రాంతం..
ఔషధాలు (ఫార్మా), విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ ముందువరుసలో ఉన్నదని, ఇప్పుడు అదనంగా ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్), డిఫెన్స్, రాకెట్స్, స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లోనూ టాప్ ప్లేస్‌లో నిలపాలనుకుంటున్నట్లు వివరించారు. దేశం మొత్తానికే డాటా సెంటర్ హబ్‌గా, పంప్ స్టోరేజీ హబ్‌గా తెలంగాణ నిలవనున్నదని, దేశంలోని నాలుగు దిక్కులకు అనుసంధానమై, దక్షిణాది రాష్ట్రాలకు ముఖ ద్వారంగా లాజిస్టిక్ సెంటర్‌గా ఉండబోతున్నదని తెలిపారు.
ట్రిపుల్ ఆర్ వెలుపల నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న గ్రామాలను రూరల్ జోన్‌గా మార్చాలనుకుంటున్నామని, ఇందుకోసం గ్రామాల్లోనూ ఉత్తమ వసతులు కల్పిస్తామన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా ఇస్తున్నామని, ఎకరానికి ఏటా రూ. 12 వేల చొప్పున రైతుభరోసా ఇస్తున్నామని, సాగుభూమి లేని కుటుంబాలకు కూడా ఏడాదికి రూ. 12 వేలు ఇస్తున్నామని, పంటలకు కనీస మద్దతు ధరతో పాటు వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ కూడా చెల్లిస్తున్నామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దాదాపు పాతిక లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల మేర లబ్ధి కలిగిందన్నారు.
సంక్షేమంలోనూ తెలంగాణ టాప్..
మౌలిక వసతుల వృద్ధితోనే ప్రభుత్వం సరిపెట్టుకోవడంలేదని, రైతులు, మహిళలు, యువత, పిల్లలు, వయోధికుల విషయంలోనూ దృష్టి పెట్టామని, తెలంగాణ రైజింగ్‌లో వారూ భాగమేనని సీఎం నొక్కిచెప్పారు. ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ స్కీమ్ ద్వారా రూ. 10 లక్షల మేర హెల్త్ కవరేజీ ఇస్తున్నామని, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందుతాయన్నారు. విద్య, నైపుణ్యాలకూ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని, అన్ని గురుకులాల్లో మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలను రెట్టింపు చేశామన్నారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా ఇంటీగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల’ను నిర్మిస్తున్నామని, కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఎంత దూరమైనా ఉచితంగా ప్రయాణించవచ్చని, ఇప్పటికే కోట్లాది మంది వినియోగించుకున్నారని గుర్తుచేశారు. దీనికి తోడు రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున ఇస్తున్నామని, ప్రతి ఏటా నాలుగు లక్షల ఇళ్లను నిర్మించడం లక్ష్యమన్నారు.
కులగణన, ఎస్సీ వర్గీకరణలో ఆదర్శం..
సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానమని స్పష్టం చేసిన సీఎం రేవంత్… దళితులు, ఓబీసీలు, గిరిజనులు, మైనారిటీలకు సామాజిక న్యాయంపై రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సమగ్ర కుల సర్వే చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందని, ఇటీవలే అసెంబ్లీలోనూ ఆమోదం లభించిందన్నారు. జనాభా దామాషా ప్రాతిపదికన వనరులను సమకూర్చుతామన్నారు.
ఎస్సీ కులాల వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మాదిగ సోదర సోదరీమణులు పోరాడుతున్నారని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవాలన్న ఉద్దేశంతో 2024 ఫిబ్రవరి 4ననే మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. సరిగ్గా ఏడాదిలోనే అమల్లోకి వచ్చేలా ఈ ఏడాది ఫిబ్రవరి 4న శాసనసభను ప్రత్యేకంగా సమావేశపర్చి తీర్మానం చేశామని, ఇకపైన ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీని ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’గా జరుపుకోనున్నామని తెలిపారు.