Cyber Fraud: రూ.2.58 కోట్లు కొట్టేసిన సైబర్ క్రిమినల్స్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సైబర్ క్రిమినల్స్ ఏకంగా ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యకే టోకరా ఇచ్చారు. దండిగా లాభాలు సంపాదించుకోవచ్చంటూ ఉచ్ఛులోకి లాగి 2 కోట్ల 58 లక్షల రూపాయలు కొట్టేశారు. మోసపోయినట్టు ఆలస్యంగా గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేంద్ర సర్వీసులో పని చేసిన ఓ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ భార్యకు సైబర్ కేటుగాళ్లు కొన్నిరోజుల క్రితం ఓ వాట్సాప్ మెసేజ్ పంపించారు. తాము చెప్పినట్టుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే ఐదు వందల శాతం లాభాలు ఖాయమని ఆశ పెట్టారు. సెబీ అనుమతులు కూడా ఉన్నాయంటూ కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లను పంపించారు. అనంతరం ఓ గ్రూప్ లో చేరమని సూచించారు. దాంతో బాధితురాలు భర్త ఫోన్ నెంబర్ ను యాడ్ చేయించింది. గత నెల 24 నుంచి ఈనెల 5వ తేదీ వరకు కేటుగాళ్లు చెప్పిన మేరకు 19 లావాదేవీల్లో 2.58 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టింది. ఆ తరువాత డబ్బు ఇన్వెస్ట్ చేయటం ఆపేసింది. దాంతో సైబర్ క్రిమినల్స్ ఆమెను బెదిరించారు. పెట్టుబడులు పెట్టటం ఆపేస్తే ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన డబ్బు పోగొట్టుకోవాల్సి ఉంటుందని భయపెట్టారు. అప్పుడు మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మైనర్ సహా బైక్ దొంగ అరెస్ట్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మైనర్ బాలునితో కలిసి బైక్ లను తస్కరిస్తున్న వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6.50 లక్షల విలువ చేసే నాలుగు టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్ప్ అదనపు డీసీపీ మహ్మద్ ఇక్భాల్ సిద్దిఖీ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విద్యానగర్ నివాసి మేరిశెట్టి నాగేశ్వరరావు (23) ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. అయితే, జల్సాగా జీవితం గడపటం అంటే ఇష్టం. అదే సమయంలో కొంతకాలంగా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో డబ్బు సంపాదించుకోవటానికి తన స్నేహితునిగా ఉన్న మైనర్ బాలునితో కలిసి బైక్ లను తస్కరించటం మొదలు పెట్టాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి స్టేషన్ల పరిధుల్లో నుంచి నాలుగు టూ వీలర్లను అపహరించాడు. కాగా, టాస్క్ ఫోర్స్ సీఐ యదేంధర్, ఎస్ఐ రవి రాజ్ తో కలిసి పక్కాగా సమాచారాన్ని సేకరించి నాగేశ్వరరావుతోపాటు అతనికి సహకరిస్తున్న మైనర్ ను సంజీవరెడ్డినగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. నాలుగు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం సంజీవరెడ్డినగర్ పోలీసులకు అప్పగించారు.
షట్టర్ లిఫ్టింగ్ గ్యాంగ్ అరెస్ట్…
వరుసగా దొంగతనాలు చేస్తున్న ఓ రౌడీషీటర్ అతని ఇద్దరు సహచరులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగు బైక్‌లు, దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీకే గూడ వాస్తవ్యుడైన సర్ధార్ జగ్ జోత్ సింగ్ ఎలియాస్ సాహిల్ (24)పై సంజీవరెడ్డినగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ నమోదై ఉంది. సనత్ నగర్ కు చెందిన అజ్మీరా మురళీకుమార్ (19), బల్కంపేట నివాసి ఎస్.తిలక్ (19) అతని స్నేహితులు. ముగ్గురికి మద్యం సేవించటంతోపాటు అన్ని వ్యసనాలు ఉన్నాయి. వాటిని తీర్చుకోవటానికి కావాల్సిన డబ్బు కోసం దొంగతనాలు చేయటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో నాచారం, కుషాయిగూడ, కీసర, అల్వాల్, జవహర్ నగర్ స్టేషన్ల పరిధుల్లో నుంచి టూ వీలర్లను తస్కరించటంతోపాటు కొన్ని షాపుల షట్టర్లను తొలగించి చోరీలకు పాల్పడ్డారు. చాలా రోజులుగా తప్పించుకు తిరుగుతున్న వీరి గురించి పక్కాగా సమాచారాన్ని సేకరించిన టాస్క్ ఫోర్స్ సీఐ యదేంధర్, ఎస్ఐ రవి రాజ్ తోపాటు సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు.

