Telangana Secretariat
తెలంగాణ, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Telangana Secretariat | సచివాలయంలో నకిలీ ఉద్యోగులు… అధికారులకు కొత్త సవాల్‌

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : తెలంగాణ సెక్రటేరియట్‌ (Telangana Secretariat) భద్రత అధికారులకు సవాల్‌గా మారుతున్నది. వరుస సంఘటనల నేపథ్యంలో సచివాలయ భద్రతపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఇటీవల ఇద్దరు నకిలీ గుర్తింపు కార్డులతో పట్టు పడటం, మరో విజిటర్ సచివాలయాన్ని పేల్చేస్తా అంటూ ఫోన్లు చేయటం సంచలనం సృష్టించింది. దీంతో, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, నిత్యం వేల మంది సందర్శకుల భద్రతతో పాటు, పాలనా వ్యవహారాలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది.


సాధారణ పరిపాలన శాఖ అధికారులు, భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ దిశగా సమావేశమయ్యారు. ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు, భద్రతను పర్యవేక్షించారు. ఇంకా ఎలాంటి నిబంధనలు అమలు చేస్తే మరింత కట్టుదిట్టమైన భద్రతతో పాటు, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, ఇతర రాష్ట్రాల్లో సెక్రటేరియట్ భద్రత, ఉద్యోగుల ఐడీ కార్డులు, సందర్శకుల నియంత్రణ తదితర అంశాలపై సమాచారం తెప్పించుకుంటున్నారు.

విశాలంగా ఉన్నా.. సమస్యలు తప్పడం లేదు…

కొత్త సచివాలయం విశాలంగా ఉన్నప్పటికీ పలు సమస్యలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఒక వ్యక్తి గేటు నుంచి లోపలికి వచ్చాక ఎవరిని కలిసేందుకు పాస్ తీసుకున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడన్న పర్యవేక్షణ కష్టంగా మారింది. అలాగే ఉద్యోగుల మాదిరిగా గుర్తింపు కార్డులు చూపించేవి, అసలైనవా, నకిలీవా అని తేల్చే యంత్రాంగం కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా సచివాలయ ఉద్యోగులకు డూప్లికేట్‌కు అవకాశం లేని హాలోగ్రామ్‌తో కూడిన కొత్త గుర్తింపు కార్డులను ఇచ్చే ప్రతిపాదన ఉంది.


అలాగే సందర్శకులకు ఇచ్చే పాస్‌ను కూడా సంస్కరించే, వారు వచ్చే పని, కలిసే వ్యక్తులు, సంబంధిత ఫ్లోర్‌కు మాత్రమే వెళ్లి, తిరిగి వెళ్లిపోయేలా నియంత్రించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అదే సమయంలో బయట ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తూ, సచివాలయానికి సమీక్షలకు వచ్చే ఉద్యోగుల గుర్తింపు కార్డులు, వారి వాహనాల అనుమతిపై కూడా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇక సచివాలయంలో పార్కింగ్ కూడా ప్రధాన సమస్యగా మారింది. లోపలకు అనుమతించే వాహనాలకు, ఉన్న పార్కింగ్‌కు పొంతన లేక ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారుతున్నది. మళ్టీ లెవెల్ పార్కింగ్‌కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఫేస్ రికగ్నిషన్ యంత్రాలతో పెరిగిన ఉద్యోగుల హాజరు శాతం…

గతంలో తెలంగాణ సచివాలయం (Telangana Secretariat) ఉద్యోగులు విధులకు హాజరు, సమయ పాలనపై ఎలాంటి నియంత్రణ ఉండేది కాదు. కొందరు ఉద్యోగులు విధులకు డుమ్మా కొట్టినా జవాబుదారీతనం లేకుండా పోయిందనే విమర్శలు ఉండేవి. దీంతో, ఈ యేడాది జనవరి నుంచి ఫేస్ రికగ్నిషన్ యంత్రాలను అమర్చి, హాజరు నమోదు తప్పనిసరి చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక నెల గడిచిన తర్వాత గణాంకాలు పరిశీలిస్తే ఉద్యోగుల హాజరు శాతం బాగా మెరుగుపడిందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.

ఆయా డిపార్ట్‌మెంట్ల ఉద్యోగుల హాజరు నమోదును పర్యవేక్షించే బాధ్యత సంబంధిత శాఖాధిపతికి అప్పగించినట్లు తెలిపారు. ఉదయం పదిన్నర కల్లా హాజరయ్యే శాతం 93 శాతానికి పెరిగినట్లు తెలిపారు. మిగతా వారు కూడా కొంత ఆలస్యంగా వస్తున్నా, అన్నీ రికార్డు అవుతున్నాయనే స్పృహతో త్వరలోనే ఆ శాతం కూడా మెరుగుపడుతున్నదన్నారు. ఇక ఒక్క ఉద్యోగులకే కాదు, శాఖాధిపతులకు కూడా (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్) ఫేస్ రికగ్నిషన్ పెట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే, ఒక్క అధికారే రెండు మూడు శాఖలను పర్యవేక్షించటం, సచివాలయానికి బయట కూడా మీటింగ్‌లకు హాజరవుతున్న నేపథ్యంలో వారికి ఇప్పట్లో హాజరు నమోదు పెట్టే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!