GHMC
తెలంగాణ, హైదరాబాద్

మెర్సీ కిల్లింగ్‌ కి అనుమతినివ్వండి.. కోర్టులో GHMC అఫిడవిట్!

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : వీధి కుక్కల బెడద జీహెచ్ఎంసీ (GHMC)కి తలనొప్పిగా మారింది. కుక్క కాటు నివారణ‌కు కుక్కలకు స్టెరిలైజ్ చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా వెటర్నరీ సెక్షన్‌ను ఏర్పాటు చేసి చర్యలు చేపట్టినా, క్షేత్ర స్థాయిలో కుక్కల బెడదను ఆశించిన స్థాయిలో నివారించకపోవటం అధికారులకు సవాల్‌గా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీహెచ్ఎంసీ ఓ సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

గడిచిన మూడేళ్లలో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు మున్సిపాలిటీల్లో కుక్కల బెడద ఎక్కువ కావటం, కుక్క కాట్లు పెరగటం, మరి కొన్ని సందర్భాల్లో కుక్కలు చిన్నారులపై పడి పీక్కు తినటం వంటి భయంకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. 2023లో అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ పై వీధి కుక్కలు దాడి చేయటంతో ఆ చిన్నారి మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వీధి శునకాల నియంత్రణతో పాటు కుక్క కాటు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా ఫోకస్ చేయటంతో పాటు సిటీలో GHMC డాగ్ క్యాచింగ్ టీమ్‌లను పెంచినా ఆశించిన ఫలితాలు రాలేదు.

కొద్ది రోజుల క్రితం శేరిలింగంపల్లి జోన్‌లో కుక్క కాటుకు గురైన ఓ వ్యక్తి సకాలంలో యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకోకపోవటంతో అతడ్ని బోనులో బంధించాల్సిన దుస్థితి తలెత్తింది. చివరకు సదరు వ్యక్తి కుక్కలా మొరగటంతో పాటు తన వద్దకు వచ్చిన వారిని గోళ్లతో రక్కటం వంటివి చేస్తూ, చికిత్స పొందుతూ కొద్ది రోజుల క్రితం మృతి చెందినట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన GHMC వెటర్నరీ విభాగం పనితీరును ప్రశ్నిస్తున్నది. రేబిస్ వ్యాధితో ఒకరు మృతి చెందిన విషయాన్ని గోప్యంగా ఉంచితే, తర్వాత ఎదురయ్యే పరిణామాలెలా ఉంటాయోనన్న భయంతో అధికారులు రేబిస్ వ్యాధి సోకిన విషయాన్ని కమిషనర్ ఇలంబర్తి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

శాశ్వత పరిష్కారం కోసం GHMC యత్నం 

వీధి కుక్కల నివారణకు ఏటా రూ. కోట్లు వెచ్చిస్తున్నా, అధికారులెందుకు మంచి ఫలితాలు సాధించలేకపోతున్నారన్న విషయంపై కమిషనర్ వెటర్నరీ సెక్షన్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. GHMC అధికారులు ఆశించిన స్థాయిలో పని చేయటం లేదని, వారు ఆశించిన స్థాయిలో పని చేస్తే రేబిస్ కేసు వెలుగుచూసేది కాదని, కుక్కల సంఖ్య ఇంత పెరిగేది కాదంటూ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆయన రెండు రోజుల క్రితం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

వ్యాధి సోకి బాధలు పడుతూ, ఇతర ప్రాణులకు హాని కల్గించే కుక్కలకు అనాయాస మరణాన్ని కల్గించేలా, వ్యాధుల బారిన పడ్డ కుక్కలను మెర్సీ కిల్లింగ్ చేసేలా అనుమతించాలని కోర్టును కోరినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ఆఫిడవిట్‌ను స్వీకరించిన కోర్టు, జంతువులను పరిరక్షించే ఎన్జీఓలు, పలు స్వచ్ఛంద సంస్థలకు నోటీసులు జారీ చేసి, వారు కోర్టుకు సమర్పించే వివరాలపై తుది నిర్ణయం వెల్లడించిన తర్వాత మెర్సీ కిల్లింగ్‌కు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారికంగా ఓ నిర్ణయానికొచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

Just In

01

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!