Vijay Kumar: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నిర్వహణపై ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ (Vijay Kumar) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులరైజేషన్ యాక్ట్ (పీఎస్ఏఆర్ఏ) ప్రకారం లైసెన్స్ తీసుకోకుండా ఏజన్సీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లైసెన్స్ లేని పక్షంలో ఏజన్సీ యజమానులకు ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ. 25 వేల జరిమానా, లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని గజ్వేల్‌లో ఇటీవల జరిగిన ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్న రంజిత్ పాండే, రితేశ్ కుమార్ రాయ్ ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డులుగా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది.
Also Read: Vijay Kumar Resigns: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బీజేపికి మరో కీలక నేత గుడ్ బై
లైసెన్స్ కాపీలను తప్పనిసరి
అయితే, వారిని నియమించుకున్న ఏజన్సీకి పీఎస్ఏఆర్ఏ లైసెన్స్ లేదని నిర్ధారణ కావడంతో, చట్ట ఉల్లంఘన కింద ఏజెన్సీ యజమానిపై బీఎన్ఎస్ సెక్షన్ 223, సీఏఎస్ఆర్ఏ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు డీజీపీ వివరించారు. రాష్ట్రంలో చాలా ఏజెన్సీలు ఇలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా కొనసాగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. ‘లైసెన్స్ కోసం www.psara.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోలీస్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే గార్డులను, సూపర్ వైజర్లను నియమించుకోవాలి. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారినే ఉద్యోగాల్లో తీసుకోవాలి. ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలతో పాటు ఆయుధాలు ఉంటే వాటి లైసెన్స్ కాపీలను తప్పనిసరిగా సేకరించాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ నేరచరిత్ర ఉన్నవారిని సెక్యూరిటీ గార్డులుగా నియమించకూడదు’ విజయ్ సూచించారు.

