తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : తెలంగాణ బీజేపీ కమలదళపతిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్నది. అన్నీ కుదిరితే ఢిల్లీ ఫలితాల తర్వాత ఏ సమయంలోనైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని బీజేపీలోని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నెల 15 లోపు ఏ క్షణాన్నయినా ప్రకటించే చాన్స్ ఉందని ఆ వర్గాల కథనం. జిల్లా అధ్యక్షుల నియామకంలో జాప్యం జరగడంతో ఆ ఎఫెక్ట్ స్టేట్ చీఫ్ నియామకంపైనా పడింది. అందుకే ఎంపిక ఆలస్యమైందని చెబుతున్నారు.
ఇప్పటికైనా వీలైనంత త్వరగా ప్రకటించి, స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యాచరణను ఫిక్స్ చేసుకోవాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకుపై కన్నేసిన కాషాయ పార్టీ అగ్ర నాయకత్వం ఈ కోణంలోనే స్టేట్ చీఫ్‌గా ఈటలను ఫైనల్ చేసినట్టు సమాచారం. తెలంగాణవాదిగా ఆయనకున్న ఫేమ్‌ను పార్టీ వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నదని చెబుతున్నారు.
22 ఏండ్ల రాజకీయ ప్రస్థానం
తెలంగాణవాదిగా, ఉద్యమకారుడిగా ఈటల రాజేందర్‌కు మంచి పేరుంది. 2003 నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. దాదాపు 22 ఏండ్ల రాజకీయ జీవితంలో రెండుసార్లు మంత్రిగా, ప్రస్తుతం ఎంపీగా సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. దీనికి తోడు తెలంగాణపై పూర్తిస్థాయిలో పట్టు ఉన్న వ్యక్తిగా పేరుంది. ఈ అంశాలన్నీ బీజేపీకి ప్లస్ అవుతాయని హైకమాండ్ భావిస్తున్నదని చెబుతున్నారు. దీనికితోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రకారం చూసుకున్నా బీసీల్లో ముదిరాజ్ సామాజికవర్గమే ఎక్కువ మంది ఉన్నట్లు తేలతెల్లమైంది.
దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఈటల పేరునే ఫైనల్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈటల రాజేందర్ (Eatala Rajender) పేరును అధికారికంగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని కమలం పార్టీ భావిస్తున్నదని తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు దీటుగా అత్యధిక స్థానాల్లో గెలిచి, తమ సత్తా ఏంటో చాటాలని పార్టీ వ్యూహరచన చేస్తున్నదని పార్టీలోని ముఖ్యనేత ఒకరు చెప్పారు.
ఫిర్యాదులపై హైకమాండ్ సీరియస్!
స్టేట్ ప్రెసిడెంట్ నియామకం అంశంపై తమ మాటే ఫైనల్ అని అధిష్ఠానం ఇప్పటికే స్పష్టం చేసింది. కమ్యూనిస్టు భావజాలం కలిగిన ఈటలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంపై పలువురు లీడర్లు హైకమాండ్ వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. తాము ముందు నుంచీ పార్టీని నమ్ముకొని, జాతీయభావంతో పనిచేస్తున్నామని అధిష్ఠానం వద్ద నివేదించుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ అంశంపై పార్టీలో పాత, కొత్త వివాదం సైతం తెరపైకి వచ్చింది. అయినా పార్టీ ఈటల వైపే మొగ్గు చూపినట్లు సమాచారం.
అంతేకాకుండా ఈటలపై ఫిర్యాదులు చేసిన ఇతర నేతలపై కాషాయ పార్టీ అగ్ర నాయకత్వం సీరియస్ అయినట్లు తెలిసింది. ఎవరిని ప్రెసిడెంట్ చేయాలన్న అంశంలో పూర్తిగా హైకమాండ్ నిర్ణయమేనని గతంలోనే స్పష్టంచేశామని, తమ మాటే ఫైనల్ అని తేల్చి చెప్పారని సమాచారం. ఇన్నాళ్లు రాష్ట్ర నాయకులు చెప్పింది విన్నామని, ఇక వారి అభిప్రాయాలకు నో చాన్స్ అంటూ తేల్చేసిందని చెబుతున్నారు. స్టేట్ చీఫ్ అంశంలో తాము చెప్పింది వినాల్సిందేనని, పార్టీ అవసరాలకు అనుగుణంగా ఎంపిక ఉంటుందని నొక్కి చెప్పిందని విశ్వసనీయవర్గాల సమాచారం.
ఆసక్తి రేపిన ఈటలకు కేసీఆర్ ఫోన్!
బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఈటల పేరు బలంగా వినిపిస్తున్న తరుణంలో రెండ్రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ ఈటలకు ఫోన్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిని ఈటల వర్గీయులు ఖండించడమే కాక సైబరాబాద్ సీపీకి ఫిర్యాదుచేయడంతో ఈ ప్రచారానికి బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా తెలంగాణ కాషాయ దళపతిగా రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, అర్వింద్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు పేర్లు ముందు నుంచీ బలంగా వినిపిస్తున్నాయి.
అయితే ఈటల రాజేందర్‌కే రాష్ట్ర పార్టీ పగ్గాలు అందించనున్నారని, దాదాపు ఖరారైనట్లేనని ప్రచారం సైతం ముందు నుంచే జరుగుతోంది. దానికి అనుగుణంగానే ఆయన పేరునే పార్టీ సైతం ఖరారు చేసే చాన్స్ ఉందని వినికిడి. ఇప్పటికే 8 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి అధికార కాంగ్రెస్‌కు షాకిచ్చిన కమలదళం.. ఈటలకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి తమ సత్తా ఏంటో చాటాలని ప్లాన్ చేస్తున్నది. ఈ విషయంలో ఈటల ఏ మేరకు సక్సెస్ అవుతారోనన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.