తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, జాతీయ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు గురువారం లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో బీసీ కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిందని, అసెంబ్లీలో తీర్మానం చేసిందని లేఖలో వెల్లడించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా శ్రమించారని పేర్కొన్నారు. ఈ సర్వేతో రాష్ట్రంలోని బీసీలకు మరింత న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వే విజయవంతానికి సహకరించిన పార్టీ నాయకులకు, అధినాయకత్వానికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.