Bhatti Vikramarka: ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, గాడి తప్పిన ఆర్థిక విధానాన్ని దారిలో పెడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందుకే వీలైనంత త్వరగా ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని ఆయన చెప్పారు. ఉదయం శాసన పరిషత్తులో సభ్యులు ఏవీఎన్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సవివరంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు వివిధ అవసరాల కోసం తీసుకున్న ఈఎంఐలను ప్రతి నెలా ఒకటో తేదీన చెల్లించకపోతే బ్యాంకులు వారి ఖాతాలను డిఫాల్ట్ జాబితాలో చేరుస్తాయన్నారు. గత ప్రభుత్వం 18వ తారీఖున కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితి ఉండేదని, దాంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.
రిటైర్మెంట్ వయోపరిమితిపై
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతినెలా ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని భట్టి తెలిపారు. ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకు, ఉద్యోగుల ప్రయోజనాలు చెల్లించకుండా ఉండేందుకు రిటైర్మెంట్ వయోపరిమితిని మూడు సంవత్సరాలకు గత ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. ఒకవేళ వయోపరిమితి పెంచకపోయి ఉంటే 2021 నుంచి 2023 మధ్య 26,854 మంది పదవి విరమణ పొందే వారని, కానీ పెంపు వల్ల కేవలం 6,354 మంది మాత్రమే రిటైర్ అయ్యారని వివరించారు. కేవలం నిధుల సర్దుబాటు కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
పేద కుటుంబాల ఊతం
గృహ జ్యోతి పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తోందని భట్టి తెలిపారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు గృహ జ్యోతి లబ్ధిదారుల సంఖ్య 52,82,498 కు చేరిందని, వీరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 3,593.17 కోట్లను విద్యుత్ సంస్థలకు చెల్లించిందని వివరించారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 25,35,560 మంది, ఎన్పీడీసీఎల్ పరిధిలో 27,46,938 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న 52.82 లక్షల కుటుంబాలకు రూ. 3,593.17 కోట్ల మేర ఆర్థిక వెసులుబాటు కలిగిందన్నారు. ఆదా అయిన ఈ సొమ్మును పేద కుటుంబాలు సామాజికంగా, ఆరోగ్యకరంగా ఎదిగేందుకు మరియు తమ పిల్లలను మంచి చదువులు చదివించుకునేందుకు వినియోగించుకుంటున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Also Read: Bhatti Vikramarka: కొత్త ఏడాది సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సందేశం

