జనసేన (Janasena) పార్టీకి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కామన్ సిమ్బల్ తో పోటీ చేసే వెసులుబాటు కల్పించింది. అయితే జనసేన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో లేనట్టే కనిపిస్తోంది. ఎన్డీయే కూటమిలో భాగంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేసింది.
పవన్ కళ్యాణ్ పోటీకి సుముఖంగా లేనప్పటికీ బీజేపీ ఒత్తిడితో ఆఖరి నిమిషంలో 8 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలబెట్టారు. పోటీ చేసిన అన్ని చోట్లా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. అనంతరం పూర్తిగా ఏపీ ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. అక్కడ పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. ప్రజెంట్ ఆయన ఫోకస్ ఏపీ రాజకీయాలపైనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ స్థానిక ఎన్నికల్లో జనసేన (Janasena) పోటీ అనుమానమే.