Kishan Reddy: లీకేజీల సమస్య, డ్రైన్ సమస్యలు పరిశీలన
శాశ్వత పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని ఆదేశం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) గురువారం బస్తీ పర్యటన చేపట్టారు. వివిధ డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన అధికారులతో కలిసి గురువారం బస్తీ వాస్తులతో సమావేశమయ్యారు. హిమాయత్ నగర్ డివిజన్, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఆయన కలియతిరిగారు. ఈ సందర్భంగా తొలుత హిమాయత్ నగర్ డివిజన్ అవంతి నగర్‌లో పర్యటించిన ఆయన బస్తీలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. పలు సమస్యలను ఆయనకు బస్తీవాసులు వివరించారు. తన దృష్టికి తెచ్చిన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. గాంధీనగర్‌లో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. అవంతి నగర్‌లో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
Read Also- Rythu Bharosa Payment: సంక్రాంతికి రైతు భరోసా నగదు జమవుతుందా?.. తాజా పరిస్థితి ఏంటంటే?
ముఖ్యంగా బస్తీల్లో లీకేజీల సమస్య, డ్రైన్ సమస్య, స్ట్రామ్ వాటర్ సమస్య, రైన్ వాటర్ సమస్య ఎక్కువగా ఉందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో శాశ్వత పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని అధికారులని కిషన్ రెడ్డి ఆదేశించారు. అనంతరం ఖైరతాబాద్ నియోజకవర్గం సోమాజిగూడలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోని ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నాయిని వివరించారు. కానీ ప్రధాని మోడీ పాలనలో భారత్ మరింత బలపడిందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలంతా మోడీ నాయకత్వాన్ని మరింత బలపరచాలని, అప్పుడు దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంతో పాటు ప్రపంచంలో భారత్ ను విశ్వగురువుగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సులువవుతుందని పేర్కొన్నరాఉ. హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందిన నగరమని, ఇది మరింత విస్తరిస్తోందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కొత్త గ్రామాలు హైదరాబాద్ లో కలవడం వల్ల సమస్య లేదన్నారు.
Read Also- Kawasaki Z650RS: భారత్‌లో లాంచ్ అయిన కవాసాకి Z650RS.. E20 ఫ్యూయల్ సపోర్ట్‌తో
ఇప్పటికే హైదరాబాద్లోని పలు బస్తీల్లో అనేక సమస్యలు ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. బస్తీల్లోని సమస్యలే పరిష్కరించలేని సర్కార్.. జీహెచ్ఎంసీని విస్తరించాక ఎలా పరిష్కరిస్తారో అర్థం కావడం లేదని చురకలంటించారు. పెరుగుతున్న హైదరాబాద్ కు అనుగుణంగా నిధుల కేటాయింపు కూడా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు 70 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుందని, కానీ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ చాలా ముఖ్యమైనవని, ఈ రెండింటికీ నిధుల కొరత ఉందన్నారు. వీధిలైట్లు రెండున్నర ఏళ్ల నుంచి వెలగడంలేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బస్తీల్లో పాదయాత్ర చేసి తెలుసుకున్న సమస్యలను జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తే సాయంత్రంలోపు పరిష్కరించేవారని, ఇప్పుడు సంవత్సరం గడిచినా సమస్య పరిష్కారం కావడం లేదని ఎద్దేవాచేశారు. ఎలాంటి నోటీసులు జీహెచ్ఎంసీ ఇచ్చినా భయపడాల్సిన అవసరం లేదని, స్థానికులకు తాను అండగా ఉంటానని కిషన్ రెడ్డి భరోసా కల్పించారు.

