తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : గిరిజన సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో గిరిజన ఎమ్మెల్యేలతో మంత్రి సీతక్క సమావేశమై.. గిరిజన, ఆదివాసీల సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. పదేండ్లుగా బీఆర్ఎస్ పార్టీ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పోడు భూముల సమస్యలు పట్టించుకోలేదని, ఐటీడీఏ వ్యవస్థను బలహీనపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచంలో అత్యంత వెనుకబడ్డ జాతులు గిరిజనులే అని సీతక్క అన్నారు. మన అభివృద్ధికి ఐకమత్యంతో కలిసి పని చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎస్టీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నివేదిక ఆధారంగా బడ్జెట్లో ప్రత్యేక పథకాలు రూపొందించుకుందామని చెప్పారు. గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని వివరించారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్టీ ఎమ్మెల్యేలం సమావేశం అవుదామని వెల్లడించారు.
సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు గత ఏడాది రూ.2కోట్లు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. ప్రతి గిరిజన పాఠశాలల్లో, తండాల్లో సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఫిబ్రవరి 15వ తేదీన నిర్వహించేందుకు ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్న ప్రజాప్రభుత్వానికి అండగా ఉందామని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ బలరాం నాయక్, విప్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యేలు రామ్ దాస్ నాయక్, వెడ్మ బొజ్జు పటేల్, జారే ఆదినారాయణ, అనిల్ జాదవ్, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కోవ లక్ష్మి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.