Prabhas Kindness: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ కేవలం తన నటనతోనే కాదు, తన వ్యక్తిత్వంతోనూ ‘డార్లింగ్’ అనిపించుకున్నారు. తోటి నటీనటులకు ఆయన ఇచ్చే గౌరవం, ఆతిథ్యం గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు విన్నాం. తాజాగా ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తున్న రిద్ధి కుమార్, ప్రభాస్ ఉదారత గురించి ఒక మనసుకు హత్తుకునే విషయాన్ని పంచుకున్నారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read also-Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డతో మూవీ అనౌన్స్ చేసిన నిర్మాత నాగవంశీ.. దర్శకుడు ఎవరంటే?
రిద్ధి కుమార్ ‘ది రాజా సాబ్’ సెట్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ రోజు అక్టోబర్ 23, అంటే ప్రభాస్ పుట్టినరోజు. అయితే ఆ రోజు ఆయన షూటింగ్‌లో లేకపోవడంతో ఆమె ఆయనను కలవలేకపోయారు. తనను సినిమాలోకి తీసుకున్న హీరో పుట్టినరోజు అని తెలిసి, ఏదైనా బహుమతి ఇవ్వాలని రిద్ధి భావించారు. తన వ్యక్తిగత పనుల మీద ముంబై వెళ్ళినప్పుడు, ప్రభాస్ కోసం ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని కొనుగోలు చేశారు. కొన్ని రోజుల తర్వాత రిద్ధి, ప్రభాస్ కలుసుకున్నప్పుడు, ఆమె ఆయనకు ‘మృత్యుంజయ’ అనే పుస్తకాన్ని, తాను స్వయంగా అల్లిన (Crochet) బుక్ మార్క్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ పుస్తకం చూసి ప్రభాస్ ఎంతో సంతోషించారు. సరిగ్గా అదే సమయంలో దీపావళి పండుగ రావడంతో, ప్రభాస్ కూడా ఆమె కోసం ఒక ప్రత్యేకమైన దీపావళి గిఫ్ట్ ప్యాక్‌ను పంపారు.
రిద్ధి తన వానిటీ వ్యాన్‌కు వెళ్లి చూడగా, అక్కడ ప్రభాస్ పంపిన పెద్ద గిఫ్ట్ హ్యాంపర్ ఉంది. అందులో హనుమాన్ చాలీసా, చాక్లెట్లు మరియు ఒక అందమైన చీర ఉన్నాయి. ఒక అగ్ర కథానాయకుడు షూటింగ్‌లో కొత్తగా చేరిన నటి పట్ల ఇంతటి గౌరవం ప్రేమను చూపించడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభాస్ ఇచ్చిన ఆ బహుమతి గురించి రిద్ధి మాట్లాడుతూ చాలా భావోద్వేగానికి గురయ్యారు. “ఆయన నాకు ఇచ్చినది కేవలం వస్తువు కాదు, ఒక గొప్ప అనుభూతి. ఇంతవరకు ఎవరూ నన్ను అంత ప్రత్యేకంగా చూసుకోలేదు. ఆ క్షణం నాకు ఒక అద్భుత కథలా అనిపించింది,” అని ఆమె పేర్కొన్నారు. ఆ చీరను తాను ఎప్పటికీ ఎంతో ప్రాణప్రదంగా దాచుకుంటానని ఆమె తెలిపారు.
ప్రభాస్ తన సెట్స్‌లో అందరికీ ఇంట్లో వండిన భోజనం పెట్టడమే కాకుండా, తోటి నటీనటుల పట్ల ఇంతటి ఆత్మీయతను కనబరచడం ఆయన సంస్కారానికి అద్దం పడుతోంది. అందుకే ఆయన అభిమానుల గుండెల్లో ‘డార్లింగ్’గా నిలిచిపోయారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ సినిమాపై ఈ వార్తతో మరింత పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండో టీజర్ యూట్యూబ్ మంచి వ్యూస్ సాధించింది.

