Mahabubabad News: రైతులకు కనిపించడు.. ఫోన్లు చేస్తే సమాధానం చెప్పడు
యూరియా దొరక్క రైతన్న అల్లాడిపోతుంటే ఆయనలో ఆనందం
యూరియా వివరాలు అడిగితే జాబ్‌కు రిజైన్ చేస్తానంటూ సమాధానాలు
మహబూబాబాద్, స్వేచ్ఛ: ఈయనో వ్యవసాయ అధికారి, కానీ, రైతులను హింసించే అధికారిగా పేరు సంపాదించుకున్నాడు. రైతులు ఎవరైనా యూరియా వివరాలు అడిగితే వారినే ఎదురు ప్రశ్నిస్తాడు. గత వర్షాకాలం సీజన్‌లో ఈ అధికారి ప్రణాళిక లేమి, నిర్లక్ష్య వైఖరి కారణంగా అన్నదాతలు యూరియా కష్టాలు ఎదుర్కొన్నారు. కనీసం యూరియా బస్తాలు ఎన్ని వచ్చాయి.. ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు పంపిణీ చేయాలి అనే కనీస ప్రణాళిక లేని అధికారి తిరుపతి రైతుల పాలిట యమపాశంగా మారాడు. ఆదివారం ఉదయం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ లైన్‌లలో యూరియా కోసం నిలబడి అవస్తలు పడుతుంటే కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదంటే రైతుల మీద ఆయనకు ఉన్న గౌరవం ఏపాటిదో ఇట్టే అర్థం అయిపోతుంది.
రైతులకే సమాధానం చెప్పని అధికారి
యూరియా బస్తాల సమాచారం గురించి నిలదీసి అడిగితే రైతన్నలకు తిరుపతి సమాధానం ఇవ్వడం లేదు. అందుబాటులో లేనప్పుడు ఫోన్లు చేసినా, కనీసం స్పందన ఉండడం లేదు. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. గట్టిగా యూరియా బస్తాల గురించి అడిగితే బెదిరిస్తున్నావా… బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అంటూ తిరిగి రైతులనే బెదిరింపులకు గురి చేస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో అన్ని మండలాల్లో మండల వ్యవసాయ అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపడుతూ రైతులకు కావాలసిన యూరియాను పంపిణీ చేస్తుంటే, ఈయన మాత్రం అందుకు భిన్నంగా ప్రణాళిక లేకుండా రైతులకు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాడు.
Read Also- January Bank Holidays: జనవరిలో భారీగా బ్యాంక్ హాలిడేస్.. ముందే జాగ్రత్త పడండి మరి.. తేదీలు ఇవే
గత సీజన్‌లో దాడి తప్పింది!
గత సీజన్‌లో పోలీసు అధికారుల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ జరిగింది. ఈయన ఆధ్వర్యంలో జరిగివుంటే ఈ అధికారిపై రైతులు దాడి చేసినా ఆశ్చర్యం కలిగేది కాదు. రైతుల ఆగ్రహాన్ని కనిపెట్టిన పోలీసులు అధికారి తిరుపతిని రైతులకు కనిపించకుండా జాగ్రత్త పడుతూ లారీలు వచ్చిన సమయంలో స్వయంగా పోలీసులే వచ్చి దిగుమతి చేసుకొని రైతులకు సంబంధించిన జాబితా ప్రకారం యూరియాను పంపిణీ చేశారు. ఆ సమయంలో కూడా తన బాధ్యతలను మరిచి ఉన్నతాధికారిపై గుర్రుగా వ్యవహరించినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆదివారం నుంచి మహబూబాబాద్ జిల్లాలో అన్ని మండలాల్లో కూడా యూరియా దిగుమతి అయ్యింది. దిగుమతి అయిన యూరియా బస్తాల లెక్క ప్రకారం రైతుల జాబితా తయారు చేసి వారికి అందించేందుకు అన్ని విధాలుగా మిగతా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Read Also- January Bank Holidays: జనవరిలో భారీగా బ్యాంక్ హాలిడేస్.. ముందే జాగ్రత్త పడండి మరి.. తేదీలు ఇవే
బెదిరిస్తున్నావా?
ఇదే విషయమై స్థానిక ఉన్నతాధికారి ఒకరు కలగజేసుకొని, ఈసారైనా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా అని ఆరాతీయగా దురుసుగా మాట్లాడుతూ… ఏంటి బెదిరిస్తున్నావా? ఎక్కువ మాట్లాడితే ఇప్పుడే ఉద్యోగానికి రిజైన్ చేస్తానంటూ అన్నట్టుగా తెలిసింది. గత సీజన్, ప్రస్తుత సీజన్‌లో కూడా రైతులకు అనుకూలమైన విధంగా నడుచుకోకపోవడంతో పాటు వారికి కోపం తెప్పించేలా ప్రవర్తిస్తున్నాడు. ఏదేమైనా రైతులకు సకాలంలో అవసరమైన యూరియా పంపిణీ ప్రక్రియ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వ్యవసాయ మండల అధికారి వ్యవహార శైలి సరిగా లేకపోవడంతో స్వయంగా ఉన్నతాధికారులే రంగంలోకి దిగి రైతులకు యూరియా పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో కూడా యూరియాకు సంబంధించిన పెద్ద సమస్యలు ఎదురు కాలేదు. కేవలం మహబూబాబాద్ మండల వ్యవసాయ అధికారి తీరుతోనే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణి కార్యక్రమంలో రైతులు ఆగ్రహావేశాలు ప్రదర్శించేందుకు ప్రధాన కారణమని రైతులు ఆగ్రహంగా ఉన్నారు.

