Naa Anveshana: ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ (Naa Anveshana Anvesh) ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ప్రపంచమంతా చుట్టేస్తూ విభిన్నమైన వీడియోలతో మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్న అన్వేష్, తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. హిందూ దేవతలు, భారతీయ మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. అన్వేష్ తీరుపై విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ ధర్మాన్ని, దేవతలను కించపరిచేలా మాట్లాడటమే కాకుండా, భారతీయ మహిళల సంప్రదాయ వస్త్రధారణపై అసభ్యకరంగా వ్యాఖ్యానించారని VHP ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విశాఖపట్నంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో అన్వేష్‌పై ఫిర్యాదు చేశారు. హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసిన అన్వేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read- Jr NTR: ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన మ్యాన్ ఆఫ్ మాసెస్.. మ్యాటర్ ఏంటంటే?
వివాదం ఎక్కడ మొదలైంది?
నటుడు శివాజీ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్పందించే క్రమంలో అన్వేష్ హద్దులు దాటి మాట్లాడారని నెటిజన్లు మండిపడుతున్నారు. దేవతలను, మహిళలను కించపరిచేలా ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం ముదిరింది. ఒక ట్రావెల్ యూట్యూబర్‌గా ప్రపంచాన్ని చూపిస్తూ గౌరవం పొందిన వ్యక్తి, ఇలాంటి సున్నితమైన అంశాలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం ప్రభావం అన్వేష్ సోషల్ మీడియా అకౌంట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. తన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ఆయనను అన్‌ఫాలో చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ వివాదం మొదలైనప్పటి నుంచి ఆయన దాదాపు 8 లక్షలకు పైగా ఫాలోయర్స్‌ను కోల్పోయారని తెలుస్తోంది. డిజిటల్ ప్రపంచంలో ఒక క్రియేటర్‌కు సబ్‌స్క్రైబర్లే బలం, కానీ ఇప్పుడు ఆ బలమే ఆయనకు దూరమవుతోంది.
Also Read- ibomma Ravi Case: ‘ఐబొమ్మ రవి కేసు’.. సంచలన విషయాలు చెప్పిన సైబర్ క్రైమ్ డీసీపీ!
ఇండియాకు వస్తే అరెస్ట్ తప్పదా?
ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో ఆయన ఎప్పుడు ఇండియాకు వచ్చినా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. చట్టపరంగా దేవతలను, మతపరమైన నమ్మకాలను కించపరిస్తే కచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో అన్వేష్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా చలామణీ అయ్యే వారు మాట్లాడే ప్రతి మాటపై బాధ్యత ఉండాలి. విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచాల్సిన యూట్యూబర్లు.. సంస్కృతిని, సంప్రదాయాలను కించపరిస్తే ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం అన్వేష్ క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. శివాజీకి కూడా ఆయన క్షమాపణలు చెప్పారు. కానీ, ఆయన చేసిన అసభ్యకర కామెంట్స్‌పై యాక్షన్ తీసుకోవాల్సిందేనని VHP డిమాండ్ చేస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

