Telangana Assembly 2025: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మెుదలయ్యాయి. ఈ సందర్భంగా సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అసెంబ్లీకి హాజరయ్యారు. తొలుత సభలో జాతీయ గీతాన్ని సభ్యులు ఆలపించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), రాష్ట్ర మంత్రులు కేసీఆర్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్, సీఎం రేవంత్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.
కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరచాలనం అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య కొద్దిసేపు సంభాషణ జరగ్గా.. అసెంబ్లీలోని అన్ని పార్టీల సభ్యులు వారిద్దరినే చూస్తూ ఉండిపోయారు. మరోవైపు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy), శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సైతం కేసీఆర్ కు అభివాదం చేసి.. క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.
అసెంబ్లీలో మూడే నిమిషాలు..
జాతీయ గీతాలాపన అనంతరం కేసీఆర్ అసెంబ్లీలో మూడే నిమిషాలు గడిపారు. దివంగత సభ్యుల సంతాప తీర్మానానికి సైతం ఆయన సభలో ఉండలేదు. ప్రతిపక్ష నేత ఛాంబర్ కు కేసీఆర్ వెళ్లిపోయారు. అక్కడ అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకం చేశారు. అయితే కేసీఆర్ అసెంబ్లీ రాక నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి ఉత్కంఠ ఏర్పడింది. ప్రతిపక్ష నేతగా సభలో ఉండి.. ప్రభుత్వపై ప్రశ్నల వర్షం కురిపిస్తారని అంతా భావించారు. తీరా మూడు నిమిషాల వ్యవధిలోనే ఆయన అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్‌కు ఘన స్వాగతం..
అంతకుముందు హైదరాబాద్ లోని నందినగర్ లో గల నివాసం నుంచి బయల్దేరి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పలువురు ఎమ్మెల్యేలు పుష్పగుచ్చం ఇచ్చి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల తొలి రోజున సభలో సంతాప తీర్మానాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మణ్ రెడ్డికి అసెంబ్లీ సంతాపం తెలిపింది.
కీలక అంశాలపై చర్చ..
ఈ అసెంబ్లీ సమావేశాల్లో 42% రిజర్వేషన్లు అంశం, జిహెచ్ఎంసి విస్తరణ సంబంధించిన అంశాలపై సైతం చర్చించబోతున్నట్లు సమాచారం. అయితే ఏ అంశాలు చర్చిస్తారు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్. ఏది ఏమైనా శీతాకాల సమావేశాలు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. కృష్ణ గోదావరి జలాలపై.. ఒకరిపై ఒకరు విమర్శ.. ప్రతి విమర్శలు చేసుకోనున్నట్లు స్పష్టమవుతోంది. కాబట్టి ఈ శీతాకాల సమావేశాలు కూడా అధికార, విపక్ష పార్టీల మధ్య రాజకీయ వేడిని రగిలించడం ఖాయంగా కనిపిస్తోంది

