తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna)పై కాంగ్రెస్ చర్యలు తీసుకోనున్నది. రెండు రోజుల్లో నోటీసులు ఇవ్వాలని టీపీసీసీ నిర్ణయించింది. కార్యకర్తలు, నేతల నుంచి వరుసగా ఫిర్యాదులు అందడంతోనే టీపీసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. పార్టీ లైన్‌కు విరుద్ధంగా ఆయన వ్యవహరించడమే ఇందుకు కారణమంటూ టీపీసీసీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్వహించిన బీసీ కుల గణనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తప్పుబడుతూ వస్తున్నారు. లెక్కల్లో గందరగోళం ఉన్నదని, బీసీలను కావాలనే తగ్గించారని రెండు రోజుల క్రితం ఆయన సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. అంతేగాక టీవీ చానల్స్‌లోనూ బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పారు. కేసీఆర్ సర్వేనే బెస్ట్ అంటూ ఆయన తన సొంత ఛానల్ లోనూ కాంప్లిమెంట్ ఇచ్చారు.
మరోవైపు మంగళవారం కౌన్సిల్‌లో స్టేట్‌మెంట్ తర్వాత కూడా తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) సరైన స్థాయిలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదు. సర్వే క్లారిటీ లేదని, స్పష్టమైన వివరాలు లేవని స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ముందే ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఊరుకోమని, కాంగ్రెస్‌లో స్వేచ్ఛగా ప్రశ్నించే అవకాశం ఉన్నందునే తాను ఇలా మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు. మల్లన్న మాట్లాడే సమయంలో పీసీసీ చీఫ్ పక్కనే ఉండి సైగలు చేస్తున్నా.. మల్లన్న ఇవేమీ పట్టించుకోలేదు. తాను చెప్పాలనుకున్నది సూటిగానే ప్రశ్నించారు. ఇది ప్రతిపక్షాలకు కూడా సభలో ప్లస్ అయింది.
ఇక గతంలోనూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) పై మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతకంటే ముందు పలువురు నేతలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వరంగల్ బీసీ సభలోనూ మల్లన్న హాట్ టాపిక్ అయ్యారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డే (CM Revanth Reddy) లాస్ట్ సీఎం అని నొక్కి చెప్పారు. ఒక వైపు పార్టీ ఎమ్మెల్సీగా గెలిచిన మల్లన్న మొదట్నుంచి కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారని, దీంతో పార్టీ డ్యామేజ్ అవుతుందని కొందరు నేతలు కంటిన్యూగా పీసీసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. వీటన్నింటిని పరిశీలించిన పీసీసీ.. రెండు రోజులలోపు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ చర్యలు అన్ని కేసుల వలే నోటీసులకే పరిమితం అవుతాయా? లేదా పార్టీ నుంచి బహిష్కరిస్తారా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
స్టేట్మెంట్ కాపీలు కాల్చివేత…
60 శాతానికి పైగా ఉన్న బీసీలను కేవలం 40 శాతానికి చూపించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో తప్పుడు లెక్కలతో స్టేట్‌మెంట్లు ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన వివరాలన్నీ దొంగ లెక్కలు అంటూ ఆయన తన సొంత చానల్‌లో ఫైర్ అయ్యారు. అనంతరం స్టేట్‌మెంట్ కాపీలను కాల్చుతూ ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన స్టేట్‌మెంట్‌ను సొంత పార్టీ ఎమ్మెల్సీ విమర్శించడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో మల్లన్న నిరసన వీడియో ట్రెండింగ్ అయింది. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఎవరికి వారు తమకు అనుకూలంగా ఆ వీడియోను వినియోగిస్తున్నాయి. మల్లన్న నిజంగా నిరసన చేస్తున్నాడా? డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఇలా వ్యవహరిస్తున్నారా? అని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వస్తున్నాయి.