Kunamneni Sambasiva Rao: ఎర్ర జెండాలన్నీ ఏకమై ఒకే జెండాగా మారి, ఆ జెండా ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగరాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివ రావు (Kunamneni Sambasiva Rao) అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ లేకపోతే ప్రస్తుతం అనుభవిస్తున్న చట్టాలు, హక్కులు ఉండేవే కాదని, కమ్యూస్టు పార్టీ లేకపోతే ప్రజలకు రక్షణ కవచం లేనట్టేనని స్పష్టం చేశారు. అనేక విరోచిత పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను, చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తిరోగమన దిశగా వెళ్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోరాడి తమ ప్రాణాలు అర్పించిన మహానీయుల ఆశయాలతో సిపిఐని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. సిపిఐ వందేళ్ల ఆవిర్భావ దినోత్సవ సభ’ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మగ్ధూంభవన్‌లో జరిగింది.
అనేక మంది నాయకులపై కుట్ర కేసులు నమోదు
ఈ సందర్భంగా సిపిఐ పతాకాన్ని కూనంనేని సాంబశివరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తవుతుందని, దోపిడీవర్గాల నుంచి మానవ జాతి విముక్తి కోసం అనేక త్యాగాలు, విరోచిత పోరాటలు చేసిన ఘనమైన చరిత్ర సిపిఐకే ఉందన్నారు. బ్యాంకుల జాతీయకరణ, భూ సంస్కరణలు, రైతాంగ విముక్తి, కార్మికులకు 8గంటల పనిదినాలు, అసంఘటితరంగ కార్మికులు, దళితులు, బడుగు బలహీనవర్గాలకు, పీడిత వర్గాలు కూడా ప్రధాన స్రవంతిలో భాగస్వాములనే విషయన్ని సిపిఐ నినదించిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ప్రపంచ పుట్టల్లో లిఖించదగిందన్నారు. జైలులోనే భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టిందని, పుట్టుకలోనే పార్టీ గొంతు నూలిమేయాలని ప్రయత్నించారని, కొందరికి యావజ్జీవ శిక్ష విధించారని, మరి కొందరిని ఉరి తీశారని, అనేక మంది నాయకులపై కుట్ర కేసులు నమోదు చేసినప్పటికీ వాటన్నింటినీ తట్టుకుని కమ్యూనిస్టులుగా నిలబడ్డారని గుర్తు చేశారు.
Also Read: Kunamneni Sambasiva Rao: ఎర్రజెండా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం.. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు
పేదరికం లేకుండా చేస్తాం
కమ్యూనిజం, ఎర్రజెండా లేకపోతే ప్రజలకు రక్షణ కవచం లేదని, ఎప్పుడు ఏమైతుందోననే భయానక పరిస్థితులు ఉంటాయని తెలిపారు. ప్రధాని మోదీ, బిజెపి లాంటి తిరోగమనం, కార్పొరేట్లకు ఊడిగం చేసే సిద్ధాంతం కలిగిన వాళ్లు కమ్యూనిజం అంటేనే ఒక భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, కమ్యూనిస్టులు ఉండకూడదని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నదని అన్నారు. పేదరికం లేకుండా చేస్తామని చెప్పాల్సిన ప్రభుత్వం, 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్ల పేరుతో ప్రజల తరపున ప్రశ్నించే వారిని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బ్రిటీష్ కాలంలోనే పోరాటం చేసి సాధించుకున్న హక్కులను, చట్టాలను మోదీ ప్రభుత్వం తీసివేస్తోందని, కార్మికులకు సమ్మె చేసే హక్కు కూడా లేదని, రాష్ట్రంలో ఆర్‌టిసిలో కూడా అదే పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ఇచ్చిన జీతాలు తగ్గిస్తున్నారన్నారు. మావోయిస్టుల గురించి మాట్లాడే వారిని కూడా జైలులో పెడుతున్నారని విమర్శించారు.
సభకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నర్సింహ అధ్యక్షత వహించగా సిపిఐ జాతీయ కార్యదర్శులు పల్లా వెంకట రెడ్డి, కె.రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్‌పాషా, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, రమావత్ అంజయ్యనాయక్, ప్రజా సంఘాల నాయకులు ప్రేంపావని ( శ్రామిక మహిళా ఫోరం) ఎన్.జ్యోతి(ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు), ఎం.నర్సింహ, బి.వెంకటేశం, నండూరి కరుణకుమారి (ఎఐటియుసి), కలకొండ కాంతయ్య (తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం), పల్లె నర్సింహ, ఉప్పలయ్య (ప్రజానాట్యమండలి), వలీ ఉల్లా ఖాద్రీ (ఎఐవైఎఫ్),కసిరెడ్డి మణికంట రెడ్డి, పుట్ట లక్ష్మణ్ (ఎఐఎస్‌ఎఫ్), సిపిఐ సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతంయాదగిరి, కార్యవర్గ సభ్యులు నెర్లేకంటి శ్రీకాంత్ పాల్గొన్నారు.

