Caste Census | తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నేటి (మంగళవారం) నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగా, క్యాబినెట్ సమావేశం దృష్ట్యా సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. ఆయన అభ్యర్ధన మేరకు మధ్యాహ్నం రెండు గంటల వరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. క్యాబినెట్ భేటీ అనంతరం తిరిగి రెండు గంటలకు సభ ప్రారంభ అయింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
కుల సర్వే-2024 (Caste Census -2024) నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదని చెప్పారు. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉందన్నారు. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదని చెప్పారు.
జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు పొందుపరచలేదని… అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన చేస్తామని మాట ఇచ్చారని సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. కులగణన ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ నివేదికను సభలో ప్రవేశపెట్టామన్నారు. ప్రతీ గ్రామంలో, తండాల్లో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.
Also Read : రైల్వే శాఖ టార్గెట్ ఫిక్స్… AP, TG కి బెనిఫిట్స్ ఇవే
“ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్ గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించాం. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారు. రూ.160 కోట్లు ఖర్చుచేసి ఒక నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించాం. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టాం. 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందించడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా” అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
కులసర్వే డేటా :
రాష్ట్రంలో 66 లక్షల 99 వేల 602 కుటుంబాల సమాచారం సేకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తం తెలంగాణలో 96.9 శాతం సర్వే చేశామన్నారు. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి 36 రోజులు పట్టిందని చెప్పారు. ఏడాదిలోపు సర్వేను విజయవంతంగా పూర్తి చేశామని సీఎం వెల్లడించారు. ఎస్సీలు-17.43 శాతం, ఎస్టీలు- 10.45 శాతం, బీసీలు- 46.25శాతం, ముస్లీం మైనార్టీల్లో బీసీలు- 10.08 శాతం, ముస్లీం మైనార్టీలు కలుపుకుని బీసీలు- 56 శాతం, రాష్ట్రంలో ముస్లింలతో సహా మొత్తం ఓసీలు- 15.79 శాతం ఉన్నట్లు సీఎం తెలియజేశారు.