UPSC Topper: అనుదీప్ దురిశెట్టి కథ ఎక్కడో పెద్ద ఆఫీసుల్లో, మెరిసే గ్లాస్ భవనాల్లో మొదలుకాలేదు. అది తెలంగాణలోని ఓ చిన్న పట్టణంలో, సాధారణ కలలతో ఉన్న ఒక విద్యార్థి మనసులో పుట్టింది. చదువులో చురుకుగా ఉండే అతడు, కష్టపడి ఇంజినీరింగ్ పూర్తి చేసి దేశంలోనే నెంబర్ ఆన్ అయిన కాలేజీలో చదువుకున్నాడు. ఆ తర్వాత గూగుల్‌లో ఉద్యోగం సంపాదించాడు. నెలకు లక్షల్లో జీతం. చాలామందికి ఇదే జీవిత లక్ష్యం, ఇదే సక్సెస్. కానీ అనుదీప్ మనసులో మాత్రం ఒక మౌనమైన కల మెదులుతూ ఉండేది. చిన్ననాటి నుంచి అతన్ని వెంటాడిన ఆ కల దేశానికి సేవ చేసే IAS అధికారి కావాలని.
ఆ కలే అతడిని ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా చెప్పుకునే UPSC వైపు నడిపించింది. 2012లో తొలి ప్రయత్నం చేశాడు. ఫలితం నిరాశ. ఆ ఒక్క ఫెయిల్యూర్ అతన్ని వెనక్కి నెట్టలేదు. అసలు నిజమైన ప్రయాణం అక్కడే మొదలైంది.
అతడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. గూగుల్ ఉద్యోగాన్ని వదిలేయకుండా, అదే ఉద్యోగంతో పాటు UPSCకు సిద్ధం కావాలని. పగలంతా ఆఫీసు పనులు, రాత్రంతా పుస్తకాలతో పోరాటం. ఇతరులు విశ్రాంతి తీసుకుంటున్న సమయాల్లో, అనుదీప్ మాత్రం తన కల కోసం నిద్రను త్యాగం చేశాడు. 2013లో మళ్లీ పరీక్ష రాశాడు. ఈసారి విజయం అతడి వైపు చూసింది. మంచి ర్యాంక్‌తో IRS ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. చాలా మందికి ఇది కథకి హ్యాపీ ఎండింగ్ అయ్యేది. కానీ అనుదీప్‌కు మాత్రం ఇది మధ్యలో వచ్చిన స్టాప్ మాత్రమే. అతని గమ్యం ఇంకా ముందుంది.
IRS అధికారిగా సేవలందిస్తూనే, మరోసారి IAS కల కోసం సిద్ధమయ్యాడు. సమయం దొరికినప్పుడల్లా చదువు. డిసిప్లిన్, ఓర్పు, లక్ష్యంపై నమ్మకం ఇవే అతని ఆయుధాలు. 2017లో మళ్లీ UPSC పరీక్ష. ఫలితాలు తెలిసిన రోజు .. దేశమంతా ఒక పేరు మాట్లాడుకుంది. ఆ పేరే అనుదీప్ దురిశెట్టి .. ఆల్ ఇండియా ర్యాంక్ 1.
Also Read: Telangana Temples: ఆలయంలో ఇదేం తంతు.. పూజలు, టోకెన్ అంటూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వైనం..!
ఈ ప్రయాణం మనకు కొన్ని గొప్ప పాఠాలు చెబుతుంది. ఫెయిల్యూర్ అంటే ముగింపు కాదు. అది ముందుకు నడిపించే మెట్టు మాత్రమే. పెద్ద జీతం, కంఫర్ట్ జోన్ అందరికీ సరిపోవు; కొందరికి జీవితంలో అర్థం కావాలి. అలాగే, కలల కోసం ప్రతిదీ వదిలేయాల్సిన అవసరం లేదు. మీ బాధ్యతల్ని మోస్తూనే, మీ లక్ష్యాల వైపు నడవచ్చు.
అనుదీప్ ఖరీదైన కోచింగ్‌లపై ఆధారపడలేదు. తన మీద తనకు నమ్మకం పెట్టుకున్నాడు. సరైన ప్లానింగ్, స్వయంకృషి, అలసిపోని సంకల్పమే అతడిని శిఖరానికి చేర్చాయి. ఈ కథ మనకు ఒకటే చెబుతుంది. మీరు ఎక్కడ నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. మీ చేతిలో ఏముందన్నదీ కాదు. మీ లోపల వినిపించే ఆ చిన్న స్వరాన్ని మీరు ఎంత నమ్మకంగా అనుసరిస్తారన్నదే మీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒక్కో రాత్రి, ఒక్కో అడుగు… చివరకు మీ కల మీ ముందు నిలుస్తుంది.

