Govt Hospitals: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను రోగులకు పూర్తి సురక్షితమైన, ఆరోగ్యకరమైన ‘హీలింగ్ జోన్’లుగా మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, భద్రత, పెస్ట్ కంట్రోల్ కోసం అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ విధానంలో కీలక మార్పులు చేస్తున్నట్లు వైద్య విద్యా సంచాలకులు నరేంద్ర కుమార్(Narendhra Kumar) వెల్లడించారు. ఇటీవల కొన్ని ఆసుపత్రుల్లో తలెత్తిన ఎలుకల సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా యుద్ధప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టింది. ఆసుపత్రి వార్డుల్లో రోగుల సహాయకులు ఆహార పదార్థాలను తినడం, మిగిలిపోయిన వాటిని అక్కడే పారవేయడం వల్లే ఎలుకల బెడద పెరుగుతోందని డీఎంఈ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వార్డుల లోపల ఆహార పదార్థాల వినియోగంపై కఠిన నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. రోగుల సహాయకులు కేవలం నిర్దేశించిన క్యాంటీన్లలో మాత్రమే భోజనం చేయాలని, ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Uttam Kumar Reddy: ఇరిగేషన్ ప్రాజెక్టులను నాశనం చేసిందే కేసీఆర్: మంత్రి ఉత్తమ్ ఫైర్..!
సామాజిక బాధ్యత కూడా..
ఆసుపత్రి భవనాల్లో ఉన్న పగుళ్లు, రంధ్రాలను సిమెంట్‌తో శాశ్వతంగా మూసివేయడంతో పాటు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలలో జీరో-గ్యాప్ సీలింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో ఎలుకలు, కీటకాలు చొరబడకుండా కిటికీలు, డ్రైనేజీ పైపులకు పటిష్టమైన వైర్ మెష్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఆసుపత్రిలో హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ద్వారా నిరంతరం పెస్ట్ కంట్రోల్ పనులను పర్యవేక్షించనున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తరలించేలా సూపర్ వైజర్లను నియమించడంతో పాటు, మూతలు ఉన్న చెత్త డబ్బాలను మాత్రమే వాడాలని ఆదేశించారు. ఆసుపత్రిని శుభ్రంగా ఉంచడం అధికారుల బాధ్యతే కాదని, అది ప్రజల సామాజిక బాధ్యత కూడా అని డీఎంఈ నరేంద్ర కుమార్ గుర్తుచేశారు.
Also Read; Samsung Galaxy S26 Ultra: సామ్‌సంగ్ ఫ్యాన్స్‌కు షాక్.. Galaxy S26 Ultra ఆలస్యం వెనుక కారణం ఇదేనా..?

