Ramchander Rao: ఏకగ్రీవమైతే అది కాంగ్రెస్ గెలుపా?
గతంలో 163 సర్పంచ్ స్థానాలు.. ఇప్పుడు వెయ్యికి పైగా గెలుపు
1,200 మందికి పైగా ఉప సర్పంచ్ స్థానాలు గెలిచాం
10 వేలకు పైగా వార్డుల్లో విజయం సాధించాం
కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,000 నుంచి 1,200 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, వారిని కూడా కాంగ్రెస్ గెలుపుగా ఆ నేతలు ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. గెలిచిన వారందరినీ తమవారిగా చెప్పుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. నిర్మల్ జిల్లా సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులన ఆయన సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 181 గ్రామపంచాయతీలుంటే, అందులో 103 గ్రామపంచాయతీల్లో బజీకేపీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలిచారన్నారు. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో 128 గ్రామపంచాయతీలు ఉంటే, దాదాపు 80కి పైగా స్థానాల్లో గెలిచిందన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా 32 మంది బీజేపీ సర్పంచులు గెలిచినట్లు రాంచందర్ రావు తెలిపారు.
Read Also- Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతల తీరుపై ప్రధాని మోడీ ఫైర్.. కమల దళంలో కలకలం..!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదన్నారు. ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఫైరయ్యారు. అందుకే రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ కు తప్పకుండా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణలో గతంలో బీజేపీకి కేవలం 163 మంది మాత్రమే సర్పంచులు ఉండగా, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో వెయ్యికి పైగా స్థానాల్లో గెలిచారన్నారు. 1200 మందికి పైగా ఉపసర్పంచులు, 10 వేల మందికి పైగా వార్డు సభ్యులు విజయం సాధించారన్నారు. గతంలో ఫైనాన్స్ కమిషన్ నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని రాంచందర్ రావు ప్రజలను కోరారు. తెలంగాణ నిజంగా బంగారు తెలంగాణ కావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు.

