MLAs Defection: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ మారామని ఫిరాయించిన ఎమ్మెల్యేలే స్వయంగా మీడియాకు చెప్పినట్లు ఎక్స్ వేదికగా తెలియజేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్లందరూ తమ పార్టీలో చేరారని ప్రకటించిందని పేర్కొంది. ఇందుకు సాక్ష్యంగా ఫొటోలు, వీడియోలు సైతం ఉన్నాయని బీఆర్ఎస్ స్పష్టం చేసింది.
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ లేవనే నెపంతో అనర్హత పిటిషన్ తిరిస్కరించడం విడ్డూరమని స్పీకర్ పై బీఆర్ఎస్ మండిపడింది. రాజ్యాంగాన్ని కాపాడుతానంటూ చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ.. ఇదేనా మీరు ప్రవచించే రాజ్యాంగం అంటూ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ నిలదీసింది.
రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ మారామని
ఫిరాయించిన ఎమ్మెల్యేలే స్వయంగా మీడియాకు చెప్పారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళందరూ తమ పార్టీలో చేరారని ప్రకటించారు.
ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలుగా ఉన్నాయి.అయినా కూడా స్పీకర్ గారు సాక్ష్యాధారాలు లేవనే… pic.twitter.com/dVf6rZEB6G
— BRS Party (@BRSparty) December 17, 2025
మరోవైపు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు (Harish Rao) సైతం స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ పై స్పందించారు. ‘రాహుల్ గాంధీ గారి “సేవ్ ది కానిస్టిట్యూషన్” నినాదం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుతో నేడు పూర్తిగా బహిర్గతమైంది. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజార్చడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసిన ఈ ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది’ అని హరీశ్ రావు మండిపడ్డారు.
Also Read: Defection MLAs: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న స్పీకర్
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ-డిఫెక్షన్ నియమాలను స్పీకర్ పూర్తిగా పక్కన పెట్టారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమే. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని నిర్లజ్జగా ధిక్కరించడం మీకే చెల్లింది. ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజస్వరూపం. స్పీకర్ నిర్ణయం ఎంతో సిగ్గుచేటు, ప్రజస్వామ్యానికి చెరగని మచ్చ’ అంటూ హరీశ్ రావు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

