Jupally Krishna Rao: విజయ్ దివస్‌ను పురస్కరించుకుని చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) పాల్గొని ప్రసంగించారు. 1971 యుద్ధంలో భారత సాయుధ దళాలు కేవలం 13 రోజుల్లోనే చారిత్రక విజయాన్ని సాధించాయని, ఈ యుద్ధం ఫలితంగా 93 వేల మంది పాకిస్థాన్ సైనికులు లొంగిపోవడంతో బంగ్లాదేశ్ అవతరించిందని మంత్రి గుర్తు చేశారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దృఢమైన నాయకత్వమే ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు.
Also Read: Jupally Krishna Rao: పర్యాటక రంగంలో 40 వేల మందికి ఉద్యోగాలు.. రూ.7,045 కోట్ల పెట్టుబడులు
వీరుల త్యాగాలు దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి
ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా, అరుణ్ ఖేతర్పాల్, ఆల్బర్ట్ ఎక్కా వంటి వీరుల త్యాగాలు దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని మంత్రి కొనియాడారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో పోరాడిన తీరు గర్వకారణమని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రస్తావించిన మంత్రి, భారత్ శాంతిని కోరుకుంటూనే జాతీయ భద్రతకు ముప్పు వస్తే గట్టిగా ప్రతిస్పందిస్తుందనే స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎల్లప్పుడూ సాయుధ దళాల పక్షాన దృఢంగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
Also Read: Jupally Krishna Rao: పర్యాటక రంగంలో 40 వేల మందికి ఉద్యోగాలు.. రూ.7,045 కోట్ల పెట్టుబడులు

