గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో నాలుగు పథకాలు ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు నేటి నుంచే అమలుకు శ్రీకారం చుట్టారు. నారాయణ పేట జిల్లా కోస్గీ మండలం చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజాపాలన పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు 76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా 4 కోట్ల ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం… ఈరోజు నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను అన్నారు.
మీ రేవంత్ అన్నగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 13 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఒకటొకటిగా అమలు చేస్తున్నాము. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సీఎం అన్నారు.
ఈ రోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు అదే విధంగా బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని సీఎం స్పష్టం చేశారు.