Telangana Pocso Cases: చిన్నారులపై లైంగిక దాడులనే అమానవీయ ఘటనలు ఏయేటికాయేడు పెరిగిపోతున్నాయి. ‘పసి మొగ్గ’ లపై పైశాచికాలకు పాల్పడుతున్న కిరాతకులలో 99.2 శాతం మంది బాధితులకు బాగా తెలిసిన వారే కావడం మరింత ఆందోళనకరం. నేరాలు పెరుగుతున్నా, నేరస్తులకు శిక్షలు పడుతున్న దాఖలాలు మాత్రం లేవు. ఈ భయంకరమైన దారుణాల నుంచి బాలలకు రక్షణ కల్పించడానికి కేంద్రం తాజాగా ‘పోక్సో ఈ-బాక్స్’ను అందుబాటులోకి తెచ్చినా, ఈ సామాజిక రుగ్మతను అరికట్టడానికి మరింత కఠిన చర్యలు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాచార హక్కు చట్టం(RTI) ద్వారా డీజీపీ కార్యాలయం నుంచి సేకరించిన వివరాల ప్రకారం, 2020–25 మధ్య రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో పోక్సో యాక్ట్ ప్రకారం 16,994 కేసులు నమోదయ్యాయి. అంటే, నెలకు సగటున 283 కేసులు రిజిస్టర్ అవుతున్నాయన్న మాట. ఆందోళనాకరమైన అంశం ఏమిటంటే, ఈ కేసులలో ఎక్కువ భాగం ట్రై కమిషనరేట్లలోనే నమోదవుతున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2,619, హైదరాబాద్ 2,293, సైబరాబాద్ కమిషనరేట్ 2,026 కేసులు నమోదయ్యాయి. గడిచిన ఐదేళ్లలో నమోదైన సుమారు 17 వేల కేసుల్లో కేవలం 188 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. పోక్సో కేసుల్లో 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్షలు పడుతున్నా, పలువురు ఈ కిరాతకాలకు తెగబడుతున్నారు.
ప్రధాన కారణాలివే..
ఏయేటికాయేడు ఈ తరహా నేరాలు పెరిగి పోతుండటానికి మద్యం, గంజాయి మత్తు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దాంతోపాటు అరచేతుల్లోకి వచ్చేసిన మొబైల్ ఫోన్లు కూడా దారుణాలు పెరిగి పోతుండటానికి దారి తీస్తోంది. దీనికి నిదర్శనంగా షాద్‌నగర్ స్టేషన్‌పరిధిలో జరిగిన ఉదంతాన్ని పేర్కొనవచ్చు. మద్యానికి అలవాటు పడ్డ ఓ కిరాతకుడు జన్మనిచ్చిన కూతురి పైనే 6నెలలపాటు లైంగిక దాడి జరిపాడు. స్కూల్ టీచర్ల ప్రశ్నించినపుడు విషయం బయటపడగా, ఆ చిన్నారి గర్భం దాల్చినట్టుగా వైద్య పరీక్షల్లో వెల్లడైంది. వనపర్తిలో ఓ ట్యూషన్ టీచర్తన వద్ద చదువుకోవటానికి వచ్చిన 11 మంది నాలుగో తరగతి విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడిన ఘటన కూడా వెలుగు చూసింది. మైనారిటీ తీరని యువకులు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడుతుండటానికి ప్రధాన కారణం ఇంటర్నెట్‌లో పోర్న్ వీడియోలు చూడటం. హయత్‌నగర్ స్టేషన్ పరిధిలో పదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఇలాంటి వీడియోలకు అలవాటుపడి తమ తరగతిలోనే చదువుతున్న మానసిక పరిస్థితి సరిగ్గా లేని బాలికపై అత్యాచారం జరిపారు.
Alsom Read: 45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!
బాధితుల గోప్యత కోసం..
చాలా ఉదంతాల్లో బాధితురాళ్ల కుటుంబీకులు పరువు పోతుందనో, కన్నబిడ్డల భవిష్యత్తుపై దుష్ప్రభావం పడుతుందన్న భయంతో ఫిర్యాదులు ఇవ్వటానికి కూడా ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలోనే, బాధితుల్లో అభద్రతను పోగొట్టడంతోపాటు వారి గోప్యతను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం పోక్సో ఈ-బాక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఫిర్యాదులు చేసే వారి వివరాలను పూర్తి గోప్యతగా ఉంచుతారు. మొబైల్ ఫోన్‌లో యాప్‌డౌన్‌లోడ్ చేసుకుని, నేరం జరిగిన ప్రదేశం లేదా సందర్భం (స్కూల్, ట్యూషన్, కుటుంబ సభ్యులు, బ్లాక్ మెయిల్, ఇంటర్నెట్) వంటి ఫోటోలను క్లిక్ చేసి ఫిర్యాదు అప్లోడ్ చేయవచ్చు. ఈ వివరాలు ఢిల్లీలోని ప్రత్యేక బృందం పర్యవేక్షణలో, సంబంధిత రాష్ట్ర, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చేరతాయి. బాధితులు 1908 నెంబర్సేవలను కూడా వినియోగించుకోవచ్చు.
తల్లిదండ్రులు చేయాల్సినవి
తల్లిదండ్రులు ప్రతిరోజూ కనీసం గంట సమయాన్ని పిల్లలకు కేటాయించి వారికి బ్యాడ్‌టచ్, గుడ్ టచ్‌పై అవగాహన కల్పించాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ధైర్యంగా తమ సమస్యలను చెప్పుకునే వెసులుబాటును కల్పించాలని సూచించారు. పెద్ద స్కూల్లో వేశాం, ట్యూషన్ పెట్టించాం, అంతటితో తమ బాధ్యత తీరిపోయినట్టుగా వ్యవహరించవద్దని సూచించారు. ఇక, చాలామంది 10తరగతికి కూడా రాక ముందే పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇస్తుండటాన్ని కూడా నిపుణులు తప్పుబడుతున్నారు. ఇక, పిల్లలు మొబైల్‌లో ఏం చూస్తున్నారో పర్యవేక్షించడం, పోర్న్ సైట్లను బ్లాక్చెయ్యడం అత్యవసరమని సూచించారు. పోలీసులు ఇలాంటి కేసుల్లో వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని నిపుణులు కోరుతున్నారు. అప్పుడే కొంతలో కొంతైనా ఈ తరహా దారుణాలు తగ్గుతాయని వ్యాఖ్యానించారు.
Also Read: Ramchander Rao: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై కాంగ్రెస్‌కు ప్రేమ ఎందుకు? రాంచందర్ రావు తీవ్ర విమర్శ!

