Thummala Nageswara Rao: యూరియాను అధికంగా వినియోగించడం వలన కలిగే అనర్థాలను రైతులుకు వివరించి, దాని వినియోగాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రబీ ముందస్తు ప్రణాళికపై రాష్ట్ర, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అధికంగా యూరియా వాడకం వలన జరిగే అనర్థాలను రైతులకు వివరంగా తెలియజేయాలని మంత్రి సూచించారు. దేశంలోనే యూరియాను అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటని గుర్తు చేశారు.
రైతులకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
పంట కోత తరువాత అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణ పరంగా, భూమి పరంగా జరిగే పర్యవసానాలు రైతులకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ, ఉద్యాన, కో-ఆపరేటివ్ అధికారులు అందరూ ఒక టీమ్‌లాగా కలిసి పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. యూరియా వాడకం నష్టాలను వివరించి, దాని వినియోగం తగ్గించాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని, అందుకోసం విస్తృత పర్యటనలు చేసి రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని విస్తరించాల్సిన అవసరాన్ని మంత్రి మరోసారి గుర్తుచేసి, ఈ దిశగా కృషి చేయాలని సూచించారు.

