తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ‘బీఆర్ఎస్ (BRS) త్వరలో నాలుగు ముక్కలు అవబోతోంది, రాబోయే ఎన్నికల నాటికి పార్టీ మూతపడిపోతుంది., ఆ పార్టీలో తండ్రి, కొడుకు తప్ప ఎవరూ మిగలరు.’ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. శనివారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ…రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులతో బీఆర్ఎస్ నేతలు జీర్జించుకోలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనతో బీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతుందన్నారు.
ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ పైనా టీపీసీసీ అధ్యక్షులు ఫైర్ అయ్యారు. ఉక్కు మహిళ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పై బండి సంజయ్ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. బండి సంజయ్ తక్షణం క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం అనడానికి దావోస్ పెట్టుబడులే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రికార్డు స్థాయిలో రూ. లక్షా 78 వేల 950 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. పదేళ్ల BRS పాలనలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. పైగా పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. తెలంగాణ ప్రజల పదేళ్ల నిరీక్షణ ఇందిరమ్మ ఇళ్లతో తీరబోతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని తెలిపారు.
Also Read : గ్రేటర్ పై BRS ఫోకస్.. BJP సపోర్ట్ కోసం ట్రయల్స్?
ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రుల ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, పాలన కొనసాగిస్తున్నారన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ పథకాలను ప్రారంభిస్తామన్నారు. మరోవైపు ఇందిరాభవన్ లో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ప్రేమ్ లాల్ సంతాప సభలో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. ప్రేమ్ లాల్ మరణం వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో 30 ఏళ్ల సానిహిత్యం ఉందని భావోద్వేగానికి గురయ్యారు. హిందీ భాషలో ప్రేమ్ లాల్ కు చక్కటి ప్రావీణ్యం ఉందని, కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి తీసుకువచ్చేందుకు ప్రేమ్ లాల్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయనకు ఎలాంటి పదవులు రాలేదని, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్, తదితరులు ఉన్నారు.