BRS Water Politics: బీఆర్ఎస్ మరో ఉద్యమానికి సన్నాహాలు
BRS Water Politics (imagecredit:twitter)
Telangana News, ఆంధ్రప్రదేశ్

BRS Water Politics: నీటి వాటా కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమానికి సన్నాహాలు.. త్వరలో కేసీఆర్ ప్రకటన చేసే ఛాన్స్..!

BRS Water Politics: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావలసిన వాటాపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై పోరాటానికి బీఆర్ఎస్(BRS) సన్నద్ధమవుతోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనివల్ల మూడు ఉమ్మడి జిల్లాల రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గులాబీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరలోనే ఈ అంశాలపై ఉద్యమ స్వరూపానికి పార్టీ శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ, ఇప్పుటి నుంచే ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో మూడు రోజుల క్రితం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితర ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాజెక్టుల అంశంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.

కాంగ్రెస్ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు 

తెలంగాణ రాష్ట్రానికి, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్, గోదావరి-కృష్ణా జలాలను కొల్లగొడుతున్నా, దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రజల, రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం చేయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే, కాంగ్రెస్ ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలు అని కేంద్రం ముందు దేబరించడం బాధాకరమని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని గులాబీ నేతలు అంటున్నారు.

Also Read: Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

బీజేపీ కూడా దోషే! 

తెలంగాణ రాష్ట్రం నుంచి 8మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరు కూడా నీటి విషయంలో మాట్లాడకపోవడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు, కేంద్రంలోని బీజేపీ తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతోందని, కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడికి సహకరిస్తోందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని గులాబీ బాస్ నిర్ణయానికి వచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వచ్చి ఉంటే ఈపాటికే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవని ఆయన నేతలతో పేర్కొన్నారు. పాలమూరు(Palamuru), రంగారెడ్డి(Rangareddy), నల్గొండ(Nalgonda) ఉమ్మడి జిల్లా ప్రజల ప్రయోజనాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని, పూచిక పొల్లంత పని కూడా చేయలేకపోవడం వల్ల ఆ ప్రాంత ప్రజలు, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

రాజీపడేదే లే.. 

సాగునీరు, రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బీఆర్ఎస్ ఎన్నటికీ రాజీ పడబోదని, అందుకు అనుగుణంగా చేపట్టబోయే ప్రజా ఉద్యమాలను, కార్యాచరణను కేసీఆర్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, గోదావరి-కృష్ణా జలాల విషయంలో ఆంధ్ర జలదోపిడి పైన పోరాడేందుకు ఒక ఉద్యమ స్వరూపానికి త్వరలోనే పార్టీ శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. పార్టీ నేతలు జనం మధ్యలో ఉండేలా ప్రణాళికను కేసీఆర్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే ఎప్పటినుంచి ఈ పోరుబాట పడతారనేది శుక్రవారం గులాబీ బాస్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read: Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Just In

01

Harish Rao: హరీశ్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలు? పార్టీలో సీనియర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి!

Honor Power 2: భారీ బ్యాటరీతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న Honor Power 2 .. ఫీచర్లు ఇవే!

Ramchander Rao: బీజేపీ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపితే తాట తీస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Kavitha: లేబర్ చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం : కవిత

Panchayat Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు.. మూడు విడత ఎన్నికల్లో 85.77 శాతం పోలింగ్​ నమోదు!