తెలంగాణ బ్యూరో, రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ఈటల రాజేందర్! బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన నేత! అభ్యుదయ భావాలు ఉన్నా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తరిమేస్తే ఫాసిస్టు భావజాలం కలిగిన బీజేపీలో చేరిన నాయకుడు! ఈటల రాజేందర్‌కు కోపం వచ్చిన సందర్భాన్ని ఏ ఒక్క జర్నలిస్టూ ప్రస్తావించలేక పోతున్నారంటే ఆయన శాంత స్వభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ సాధనకు ఉద్యమం కొనసాగుతున్న సమయంలో.. నాటి టీఆర్ఎస్ కేవలం తెలంగాణ సెంటిమెంట్‌తో రాజకీయాలు చేసేందుకే ప్రయత్నిస్తున్నదని విమర్శించే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ‘50 సీట్లలో పోటీ చేస్తే.. పట్టుమని పది సీట్లు గెలవలేకపోయారు.. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతున్నదా రాజేంద్రా..’ అని పదునైన మాటలు పలికినా.. నోరెత్తలేక పోయారు! సమైక్య వాదాన్ని వినిపించినందుకు నాటి లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్‌పై తన డ్రైవర్ దాడి చేస్తే.. శాంతవచనాలే పలికారు. అంతెందుకు.. ఉద్యమంలో కీలక నేతగా ఉండి, రెండు క్యాబినెట్లలో కీలక మంత్రిగా పనిచేసిన ఈటలను నాటి బీఆర్ఎస్ అధినేత నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి తరిమేసినా కిమ్మనలేదు. అలాంటి ఈటల రాజేందర్.. ఒక్కసారిగా ఉగ్రరూపుడైపోయారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ భూముల వ్యవహారంలో అసోసియేషన్ సభ్యులకు, రియల్టర్లకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం ఆ ప్రాంత సందర్శనకు వెళ్లిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్.. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై చేయి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శాంతంగా ఉండే రాజేందర్ ఇలా ‘ఈటెలు’ ఎందుకు విసిరారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్నది.
ముద్ర చెరిపేసుకునే యత్నం?
బీజేపీ అంటేనే ఫైర్ బ్రాండ్ నేతలని పేరు. విషయం ఉన్నా.. లేకున్నా.. విరుచుకుపడిపోవడం ఆ నాయకత్వాల ప్రత్యేక. ఆ ఆగ్రహావేశాలతోనే యువతను బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారనే విమర్శలు బలంగా ఉన్నవే. తెలంగాణలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా ఎంతో మంది నేతలు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నారు. వీరందరిలోనూ ఈటల రాజేందర్ ఒక్కడే శాంత స్వభావి. ఇదే ఆయనకు ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి. తనపై ఉన్న ఈ ముద్రను చెరిపేసుకునే క్రమంలోనే.. సావకాశంగా వచ్చిన సందర్భాన్ని ఈటల రాజేందర్ సమయోచితంగా ఉపయోగించుకున్నారా? అన్న సందేహాలను పలువురు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తాను సైతం ఫైర్ బ్రాండేనని చాటుకునేందుకే చిన్న విషయంలో రచ్చ చేశారా? అన్న అనుమానాలు వెలిబుచ్చుతున్నారు.
రియల్టర్‌పై ఈటల దాడి
ఏకశిలానగర్‌లోని ప్లాట్ల వివాదంపై బాధితులు పలువురు కొద్దిరోజుల క్రితం ఈటల రాజేందర్‌ను కలిసి తమ సమస్య విన్నవించారు. ఈ మేరకు ఈటల రాజేందర్ మంగళవారం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిల ప్లాట్ ఓనర్స్వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న భూముల వివాదాన్ని సమావేశంలో లేవనెత్తడంతో ప్లాట్ల సందర్శనకు ఈటల బయలుదేరారు. అక్కడ ఉద్రిక్తత నెలకొన్న సమయంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల చేయి చేసుకున్నారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. న్యూస్ చానళ్లలో చర్చలకు కేంద్రమయ్యాయి. ఈ దాడి విషయంలో గ్యార ఉపేందర్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు ఈటల రాజేందర్‌పై కేసు నమోదు చేశారు. ఏకశిలా నగర్లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్ తో పాటు 30 మంది దాడి చేశారంటూ ఫిర్యాదు చేయగా.. భారతీయ న్యాయ సంహితలోని 126(2), 115(2), 352, 351(2), r/w 189(2), r/w 191(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈటల భారీ వివరణ
ఈ ఉదంతంపై ఈటల సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో కొర్రెముల గ్రామంలో 1985లో 149 ఎకరాలు భూమిని లేఅవుట్ చేసి 2076 మందికి అమ్మారని, కొన్న వారిలో మెజారిటీ వారు చిన్న ప్రభుత్వ ఉద్యోగులని, బ్యాంకు లోన్ పెట్టి కొన్నారని తెలిపారు. ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వాళ్లు చొరబడి ఓనర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తనకు మొరపెట్టుకోవడంతో వెళ్లానని తెలిపారు. పోలీసు ధర్మాన్ని కాపాడటంలో విఫలమైనప్పుడు.. రెవెన్యూ అధికారులు విఫలమైనప్పుడు.. ప్రజల ఓట్లతో గెలిచిన బిడ్డగా.. ధర్మాన్ని కాపాడటానికి.. వాళ్లకు అండగా ఉండడానికి వానికి పనిష్మెంట్ ఇచ్చాను. నేను దీనిని తప్పుగా భావించడం లేదు.. అని పేర్కొన్నారు. తన 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరిమీదా చెయ్యి ఎత్తలేదని, బూతులు తిట్టలేదని తెలిపారు.