Jupally Krishna Rao: తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం కానుందని, 2047 నాటికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో పర్యాటక రంగం వాటాను 10%కి పెంచాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ అనుభవాలు – వారసత్వం, సంస్కృతి – ఫ్యూచర్ రెడీ టూరిజం అనే అంశంపై మంగళవారం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో జరిగిన ఈ సమ్మిట్‌ను ప్రశంసిస్తూ, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని కేవలం సంఖ్యాత్మక సూచికగానే కాకుండా, రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి మార్గంగా అభివర్ణించారు.
అద్భుతమైన ఆర్థిక పురోగతి సాధించాం
తెలంగాణ సాధన కోసం జరిగిన త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బలమైన ఆర్థికాభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వనరులు తక్కువగా ఉన్న అనేక దేశాలు పర్యాటకాన్ని ప్రధాన ఇంజిన్‌గా చేసుకొని అద్భుతమైన ఆర్థిక పురోగతి సాధించాయని, తెలంగాణలోనూ ఈ రంగానికి అపారమైన సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. హాస్పిటాలిటీ, హస్తకళలు, రవాణా రంగాల్లోని వేలాది ఎంఎస్‌ఎంఈలకు ఇది జీవనాధారమని చెప్పారు.
Also Read: Jupally Krishna Rao: తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు
దేశీయోత్పత్తిలో పర్యాటక రంగం
తెలంగాణ పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికి, ప్రాచూర్యం, ప్రచారం కల్పించాడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొత్త పర్యాటక విధానంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి విస్తృత స్థాయి ప్రోత్సాహకాలు ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో పర్యాటక రంగం వాటాను 10%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కాకతీయ కళా తోరణం వంటి అద్భుతమైన నిర్మాణ సంపదను పర్యాటకులు తప్పక సందర్శించాలన్నారు. రాష్ట్ర పండుగలు, ఉత్సవాలు, హస్తకళలైన చేనేత, స్థానిక కళాకారుల పనితనం చిన్న వ్యాపారాలకు, సాంప్రదాయ జీవనోపాధికి మూలస్తంభాలన్నారు.
రోడ్డు పక్కన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తాం
పోతన కవితల్లో ప్రతిబింబించే తెలంగాణ ప్రజల దయ, నిజాయితీ వంటి ఉన్నత విలువలను ప్రపంచానికి చాటిచెప్పాలన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఒక సాంస్కృతిక, సామాజిక విప్లవంగా అభివర్ణించారు. ఈ పథకం ద్వారా మహిళలు సులభంగా ప్రాంతీయ పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించడం, తద్వారా సాంస్కృతిక అవగాహన, సామాజిక సుసంపన్నత లభిస్తాయన్నారు. పర్యాటకులకు లగ్జరీ నుంచి బడ్జెట్ వసతి వరకు ఏర్పాట్లు, సుదీర్ఘ ప్రయాణాలకు అనుకూలమైన రోడ్డు పక్కన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేద్దాం
నూతన పర్యాటక వెబ్‌సైట్ తో రవాణా, వసతి, భద్రత, ఆకర్షణల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు,పెట్టుబడిదారులు,పరిశ్రమ నిపుణులు అందరూ కలిసి తెలంగాణ పర్యాటక సంపదను జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేద్దామని పిలుపు నిచ్చారు. సాంస్కృతికంగా సమృద్ధిగా, ఆతిథ్యంతో, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తెలంగాణను నిలుపుదామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరు, అడిషనల్ పీసీసీఎఫ్ సునీతా భగవత్, నిథమ్ డైరెక్టర్ వెంకట రమణ, ఎక్స్పీరియం చైర్మన్ రాందేవ్ రావు తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక రంగంలో 40 వేల మందికి ఉద్యోగాలు.. రూ.7,045 కోట్ల పెట్టుబడులు
తెలంగాణ పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. కందుకూరులోని భారత్ ఫ్యూచర్ సిటీలో మంగళవారం పర్యాటక రంగంలో ఏకంగా ₹7,045 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సమిట్ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో దేశీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారు. అందుకు సంబందించి పత్రాలు మార్చుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 40 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని, ఇందులో ప్రత్యక్షంగా 10 వేల, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, టీజీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరు, తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Also Read: Jupally Krishna Rao: వేలంపాటతో పదవులు పొందేవారు నా దగ్గరకు రావొద్దు : మంత్రి జూపల్లి కృష్ణారావు

