Rahul rising voice
Top Stories, జాతీయం

National news: రైజింగ్ రాహుల్

  • ప్రతిపక్ష నేతగా ఆకట్టుకున్న రాహుల్ తొలి ప్రసంగం
  • రాహుల్ ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయిన మోదీ
  • మోదీని ఇరుకున పెట్టిన రాహుల్ గాంధీ
  • ఎన్నికల సమయంలో దేవుడితో తనకు కనెక్షన్ ఉందన్న మోదీ
  • మోదీ వ్యాఖ్యలను పార్లమెంట్ లో ప్రస్తావించిన రాహుల్
  • దేవుడి ఆదేశంతోనే దేశంలో విధ్వంస పాలన చేస్తున్నారా అన్న రాహుల్
  • అధికార పక్షాన్ని తన ప్రశ్నలతో చెడుగుడు ఆడుకున్న రాహుల్
  • పదేళ్లుగా మోదీ వైఫల్యాలను ఎండగట్టిన రాహుల్ గాంధీ

Rahul gandhi rise his voice on ten years failures of Modi
రాహుల్ గాంధీ మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ..ఎదుగుతూ వస్తున్నారు. మొన్నటిదాకా పప్పు అనిపించుకున్న నేత నేడు నిప్పుకణికగా మారారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో ఏకంగా ఎన్డీఏ గ్రాఫ్ తగ్గేలా చేశారు. ఓటమి నుంచి కూటమి దాకా ఎదిగారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా తొలిసారి లోక్ సభలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీని త‌క్కువ‌గా అంచ‌నా వేసినందుకు లోలోపల మ‌ధ‌న ప‌డుతోంది కాషాయ పార్టీ. ఎందుకంటే ఊహించ‌ని రీతిలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది. దానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర. క‌న్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా చేసిన యాత్ర పెను సంచ‌ల‌నం సృష్టించింది. దారి పొడ‌వునా వేలాది మంది ఆయ‌న వెంట న‌డిచారు. రాహుల్ గాంధీ మ‌రింత ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడిగా రుజువు చేసుకున్నారు.

ఆకట్టుకున్న తొలి ప్రసంగం

రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో చేసిన తొలి ప్రసంగం రాజకీయ ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. విపక్ష సభ్యులు అంతా హుషారు చేస్తూ బల్లలు చరుస్తూ రాహుల్ ప్రసంగం ఆద్యంతం ఆస్వాదించారు. అదే టైంలో అధికార ఎన్డీయే కూటమి నుంచి నిరసనలు వినిపించాయి. అయితే అనేకసార్లు మధ్యలో స్పీకర్ జోక్యం చేసుకుంటూ రాహుల్ దూకుడు ప్రసంగం మీద అభ్యంతరం చెప్పారు. అయినా సరే రాహుల్ గాంధీ తాను ఏదీ ఆరోపించడం లేదని ప్రధాని మోదీ స్వయంగా అన్న మాటలనే సభకు చెబుతున్నాను అని ప్రసంగం కొనసాగించారు. ఇంతకీ రాహుల్ అన్నదేంటి అంటే దేవుడి తోనే తనకు కనెక్షన్ ఉందని మోదీ ఎన్నికల సభలలో అన్న మాటలను గుర్తు చేశారు. ఆ పాయింట్ తోనే రాహుల్ గాంధీ మోదీని ఇరికించేశారు.

మాటలతో చెడుగుడు

అధికార పక్షాన్ని తన మాటలతో చెడుగుడు ఆడుకున్నారు. దేవుడు చెబితేనే దేశంలో మోదీ విధ్వంసకర పాలన చేస్తున్నారా అని కూడా విమర్శించారు. మణిపూర్ దేశంలో భాగం కాదా మణిపూర్ మండిపోతూంటే ఎందుకు ప్రధాని మోడీ మాట్లాడలేదు, కనీసం అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అని నిలదీశారు. దేశంలో భిన్న వర్గాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ పాలనా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మార్క్ హిందూత్వను ఎద్దేవా చేశారు. ఫైజాబాద్ లో బీజేపీ ఓటమిని గుర్తు చేస్తూ అయోధ్య రాముడి ఆశీస్సులు ఎందుకు లేవు అని కూడా నిగ్గదీశారు. గడచిన పదేళ్ళుగా దేశంలో సాగిన మోదీ మొత్తం పాలనను విమర్శిస్తూ రాహుల్ ప్రసంగం సాగింది. పెద్ద నోట్ల రద్దును కూడా ఆయన ప్రస్తావించారు.

శివుడు ఫొటోపై రాద్దాంతం

ఇక సభలో శివుడు ఫోటోతో రాహుల్ మాట్లాడడం మీద బీజేపీ నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అయింది. అయితే తాను ఏమీ అభ్యంతరమైన ఫోటోలు ప్రదర్శించలేదని రాహుల్ సమర్ధించుకున్నారు. కానీ దీని మీద ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే రాహుల్ గాంధీ రాజ్యాంగం ఫోటోను కూడా సభలో చూపించడం పట్ల బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను శివుడు ఫోటో , రాజ్యాంగం ఫోటోను సభలో చూపిస్తే తప్పా అని రాహుల్ ప్రశ్నించారు. అంతే కాదు శివుడి నుంచి తాను ప్రేరణ పొందాను అని రాహుల్ చెప్పారు. రాజ్యాంగానికి రక్షణగా ఉంటాను అని ఆయన అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నా హ్యాపీయే

తాను ప్రతిపక్షంలో ఉన్నందుకు ఆనందిస్తున్నాను అని ఆయన అంటూ అధికారం కంటే నిజం గొప్పదని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ సీబీఐలతో ఇండియా కూటమి నేతలను వేధిస్తోందని ఆయన ఆరోపించరు. ఏకంగా రాజ్యాంగం మీదనే దాడి జరుగుతోందని ఆయన అన్నారు. నేరుగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే ఇండియా కూటమి నేతలను టార్గెట్ చేస్తున్నారు అని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఎంపీ పదవితో పాటు తన నివాసాన్ని కూడా లాక్కున్నారని తనను ఈడీ ముందు విచారణకు పిలిచి ఏకంగా 55 గంటల పాటు విచారించారని ఆయన గుర్తు చేశారు. తాను ప్రతిపక్ష నేతగా ఈ రోజు ఉండడాన్ని గర్విస్తున్నాను అని రాహుల్ చేసిన ఈ ప్రసంగం మాత్రం ఇండియా కూటమిని ఆందంలో ముంచెత్తగా బీజేపీ నేతలను తీవ్ర అసహనానికి గురి చేసింది. మొత్తానికి దేవుడికీ తనకు కనెక్షన్ అని మోడీ అన్నట్లుగా వచ్చిన వార్తలను ఆధారం చేసుకుని సభలో రాహుల్ సెటైర్లు వేస్తూ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది అనే చెప్పాలి.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?