Akhanda 2 Issues: నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు ఊహించని పెద్ద సమస్యలో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సిన తరుణంలో, సినిమా నిర్మాతలకు మద్రాస్ హైకోర్టు నుండి లీగల్ షాక్ తగిలింది. ‘అఖండ 2’ సినిమా విడుదల, పంపిణీ లేదా వాణిజ్యపరమైన వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు సంచలనాత్మక ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది సినిమా యూనిట్‌తో పాటు, భారీ అంచనాలు పెట్టుకున్న పంపిణీదారులకు, థియేటర్ల యజమానులకు పెద్ద దెబ్బగా మారింది. ఈ లీగల్ సమస్యకు ప్రధాన కారణం ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ. గతంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకు వ్యతిరేకంగా ఈరోస్ ఇంటర్నేషనల్ రూ.28 కోట్ల ఆర్బిట్రల్ అవార్డును గెలుచుకుంది. ఈ ఆర్బిట్రల్ అవార్డును అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈ తాజా ఉత్తర్వులు వచ్చాయి.
హైకోర్టు దృష్టిలో, ప్రస్తుత సినిమాను 14 రీల్స్ ప్లస్ LLP బ్యానర్‌పై విడుదల చేసేందుకు ప్రయత్నించడం అనేది, మునుపటి న్యాయ నిర్ణయాన్ని తప్పించుకునే ప్రయత్నంగా భావించింది. అందువల్ల, తదుపరి స్పష్టమైన ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సినిమా విడుదలను, పంపిణీని అడ్డుకుంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పరిణామం అఖండ 2 నిర్మాతలను తీవ్రమైన ఆందోళనలోకి నెట్టింది. లీగల్ సమస్యలతో పాటు, నిర్మాతలకు మరో వైపు నిజాం ఏరియా బుకింగ్‌లలో కూడా ఆలస్యం ఎదురైంది. భారీ కలెక్షన్లు ఆశించిన ఈ ఏరియాలో బుకింగ్స్ ఆలస్యం కావడం వల్ల తొలి రోజు వసూళ్లపై ప్రభావం పడుతుందనే భయం ఉంది. ఒకవైపు నిజాం ఏరియా పర్మిషన్ సమస్యలు, మరోవైపు రూ.28 కోట్ల ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్‌కు సంబంధించిన లీగల్ చిక్కులు… ఈ రెండూ అఖండ 2 టీమ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవన్నీ కేవలం విడుదలకు ఒక్క రోజు ముందు జరగడంతో, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Read also-Fan Incident: మహేష్ బాబు అభిమానులకు క్లాస్ పీకిన నా అన్వేషణ.. జన్ జీ కి జరిగేది ఇదే..
సత్వర పరిష్కారం..
ప్రస్తుతం, నిర్మాతలు ఈ లీగల్ సమస్యను పరిష్కరించేందుకు ఈరోస్ ఇంటర్నేషనల్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యలన్నీ నేటి మధ్యాహ్నం లోగా పరిష్కారం అవుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ ఆలస్యం కొనసాగితే, తొలి రోజు విడుదలపై వసూళ్లపై పడే ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉంది. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు కేవలం తమిళనాడు రాష్ట్రంలో సినిమా విడుదలకు మాత్రమే పరిమితమా లేక ప్రపంచవ్యాప్త విడుదలకు వర్తిస్తుందా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. లీగల్ ప్రక్రియ, ఆర్థిక సెటిల్‌మెంట్ త్వరగా పూర్తయి, ఎలాంటి అవాంతరాలు లేకుండా సినిమా విడుదల కావాలని బాలకృష్ణ అభిమానులు కోరుకుంటున్నారు.
