IndiGo Flights: హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో గురువారం ఇండిగో కార్యకలాపాలకు భారీ అంతరాయం కలిగింది. దీని ఫలితంగా మొత్తం 40 ఫ్లైట్లు రద్దు కాగా, ప్రయాణికులు భారీ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నేడు శంషాబాద్ నుంచి బయలు దేరాల్సిన 28 విమానాలు రద్దు అయ్యాయి. అలాగే, వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్ కు రావాల్సిన విమానాలను రద్దు చేశారు. అంతే కాదు, డిసెంబర్ 3న సాయంత్రం 7 గంటల వరకు 19 డిపార్చర్లు, 21 అరైవల్స్ రద్దు అయినట్లు విమానాశ్రయ ప్రతినిధులు తెలిపారు.
విమానాశ్రయం సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన ప్రకటనలో, “ఆపరేషనల్ కారణాల వల్ల కొంతమంది ప్రయాణికుల ఫ్లైట్లలో ఆలస్యం లేదా షెడ్యూల్ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మా బృందాలు ఎయిర్‌లైన్స్‌తో కలిసి ప్రయాణికులకు అవసరమైన సమాచారం, సహాయాన్ని అందిస్తున్నాయి” అని పేర్కొన్నారు. అదేవిధంగా కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని, ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ ఫ్లైట్ చెక్ చేసుకోవాలని సూచించారు.
రెండు రోజుల్లో 54 ఫ్లైట్లు రద్దు
డిసెంబర్ 2న (మంగళవారం) కూడా మొత్తం 14 ఫ్లైట్లు, 9 డిపార్చర్లు, 5 అరైవల్స రద్దు కావడంతో రెండు రోజుల్లో రద్దయిన ఇండిగో విమానాల సంఖ్య 54కి చేరింది. ఈ రద్దులు ముఖ్యంగా దేశీయ ప్రధాన మార్గాల్లో ఉండటం వల్ల వందల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పలు నగరాలకు అరైవల్–డిపార్చర్ రద్దు
బుధవారం రోజున విశాఖపట్నం, గోవా, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, మదురై, హుబ్బಳ್ಳಿ, భోపాల్, భువనేశ్వర్ వంటి నగరాల నుండి హైదరాబాద్‌కు వచ్చే ప్రధాన విమానాలు రద్దయ్యాయి. అదే విధంగా ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్, హుబ్బಳ್ಳಿ, భోపాల్ వంటి నగరాలకు వెళ్లే డిపార్చర్లు కూడా రద్దు అయ్యాయి.
మంగళవారం రోజున రాయ్‌పూర్, కోయంబత్తూరు, ఉదయపూర్, అహ్మదాబాద్, గోవా ఫ్లైట్లు రద్దు కాగా, కోల్‌కతా మరియు విశాఖపట్నం సహా పలు నగరాలకు వెళ్లే డిపార్చర్లు కూడా నిలిచిపోయాయి. అదనంగా 9 ఫ్లైట్లు ఆలస్యమయ్యాయి.
ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయారు
ఫ్లైట్ రద్దులు, ఆలస్యాల కారణంగా అనేక మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే గంటల తరబడి ఇరుక్కుపోయారు. ముఖ్యంగా అంతర్జాతీయ కనెక్టింగ్ ఫ్లైట్లకు బయలుదేరిన ప్రయాణికులే చాలా బాధపడ్డారు.
అయ్యప్ప భక్తులపై కూడా తీవ్ర ప్రభావం
ఈ రద్దుల ప్రభావం అయ్యప్ప భక్తులపై కూడా ప్రభావం చూపింది. హైదరాబాద్–కోచ్చి ఇండిగో ఫ్లైట్ ఆలస్యం కావడంతో పలువురు భక్తులు ఎయిర్‌పోర్టులో ఇరుక్కుపోయారు. రీఫండ్‌కు సంబంధించి ఎయిర్‌లైన్ సిబ్బంది స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వారు ముందుగా బుక్ చేసిన శబరిమల దర్శన ప్రణాళికలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు.
