Formula E car Race case: ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. దీంట్లో రెండో నిందితునిగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు బుధవారం అరవింద్ కుమార్ ను విచారించేందుకు అనుమతి కోరుతూ డీఓపీటీకి లేఖ రాశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ఘనంగా చెప్పుకొని ఫార్ములా ఈ కారు రేస్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, రెండో సీజన్ కు ముందు రేస్ స్పాన్సర్ గా ఉన్న కంపెనీ అగ్రిమెంట్ నుంచి తప్పుకొంది. అయితే, రెండో సీజన్ రేస్ కోసం హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా కారు రేస్ కంపెనీకి 54కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకపోవటం. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను కూడా పట్టించుకోకుండా విదేశీ మారక ద్రవ్య రూపంలో చెల్లింపులు జరపటం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ అక్రమాలు వెలుగు చూడటంతో ఏసీబీ విచారణకు ఆదేశించింది.
Also Read: Kokapet Land Auction: మరోసారి కోట్లు పలికిన కోకాపేట భూములు.. 4 ఎకరాలకు రూ.524 కోట్లు
ఈ మేరకు విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రధాన నిందితునిగా పేర్కొన్నారు. ఆ తర్వాత వరుసగా అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ ఛీఫ్ ఇంజనీర్ బీ.ఎల్.ఎన్. రెడ్డిని నిందితునిగా చూపించారు. ఇటీవలే కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చెయ్యటానికి గవర్నర్ నుంచి అనుమతి కూడా వచ్చింది. తాజాగా అరవింద్ కుమార్ ను కూడా ప్రాసిక్యూట్ చెయ్యాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు. కాగా, ఐఏఎస్ అధికారులను ప్రాసిక్యూట్ చెయ్యాలంటే కేంద్రంలోని డీఓపీటీ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే అనుమతి కోరుతూ ప్రధాన కార్యదర్శి డీఓపీటీకి లేఖ రాశారు. అనుమతి రాగానే అరవింద్ కుమార్ పై ఛార్జ్ షీట్ దాఖలు చెయ్యనున్నారు.
