- 20 వీధి కుక్కల మృతి కేసును ఛేదించిన పోలీసులు
- పెంపుడు కుక్కను చంపినందుకు పగ తీర్చుకున్న ఓనర్
- గ్రామంలోని వీధికుక్కలపై విచక్షణారహితంగా కాల్పులు
- పోలీసుల అదుపులో నిందితులు నర్సింహారెడ్డి, అహ్మద్, మహ్మద్
A Street Dogs Mystery Left : సంచలనం రేపిన వీధికుక్కల కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పెంపుడు కుక్కను వీధి కుక్కలు దాడి చేసి చంపడంతో పగబట్టి వాటిపై ప్రతీకారం తీర్చుకున్నాడు ప్రధాన నిందితుడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం దేవునిపల్లికి చెందిన మంద నర్సింహారెడ్డి హైదరాబాద్ రెడ్ హిల్స్‌లో ఉంటున్నాడు. ఇతడి భార్య పుట్టిల్లు మహబూబ్‌నగర్ అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం. అక్కడ మేలిరకం కుక్కలను పెంచుతుంటాడు నర్సింహారెడ్డి.
అయితే, పెంపుడు కుక్కల్లోని డాక్స్ హుండ్ జాతి రకం కుక్క ఇంటి బయటకు రావడంతో వీధి కుక్కలు వెంబడించి కరిచి చంపేశాయి. మరో పెంపుడు కుక్కని కూడా గాయపరిచాయి. దీంతో వీధి కుక్కలపై పగ పెంచుకున్నాడు నర్సింహారెడ్డి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 15న పొన్నకల్ వెళ్లాడు. అతనితోపాటు ఫలక్‌నుమాకు చెందిన స్నేహితులు తారీఖ్ అహ్మద్, మహ్మద్ తాహెర్‌ను వెంటబెట్టుకెళ్లాడు. విచక్షణా రహితంగా కనిపించిన కుక్కని గన్‌తో కాల్చుకుంటూ వెళ్లాడు. దాదాపు 20 కుక్కల వరకు చంపేశాడు. గ్రామంలోని వీధివీధి తిరుగుతూ వీధి కుక్క కనిపిస్తే చాలు చంపేశాడు.
Read Also : మధ్యంతర బెయిల్.. కానీ..!
ఉదయం గ్రామస్తులు నిద్ర లేచేసరికి రోడ్లపై వీధి కుక్కలు చనిపోయి కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఖాకీలు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. అప్పటి నుంచి నిందితుల కోసం అనేక కోణాల్లో విచారణ జరిపారు. చివరికి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాల్ని, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ మీడియాకు వివరించారు. నిందితులు బెంజ్ కారులో వచ్చారని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శి విజయ రామరాజు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని, నిందితులు నర్సింహారెడ్డి, అహ్మద్, మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అహ్మద్‌కు చెందిన లైసెన్స్ గన్‌తో కుక్కలను కాల్చి చంపినట్టు వివరించారు. తాజాగా నిందితులు దావత్ కోసం పొన్నకల్ వచ్చినట్టు తెలిసి వారిని పట్టుకున్నట్టు చెప్పారు. నిందితుల నుంచి 0.22 రైఫిల్, బెంజ్ కారు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు ఎస్పీ హర్షవర్ధన్.