Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2 Thaandavam) చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇది బాలయ్య కెరీర్లోనే తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. చిత్ర యూనిట్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘యుఏ’ సర్టిఫికేట్‌ను పొందింది. అంతేకాకుండా, సెన్సార్ సభ్యుల నుంచి కూడా సినిమాకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయని తెలుస్తోంది. ‘అఖండ’ అందించిన భారీ విజయం నేపథ్యంలో, ఈ సీక్వెల్ కూడా బాక్సాఫీస్ వద్ద ‘తాండవం’ చేస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
‘అవతార్’ సునామీ భయం
‘అఖండ 2’ విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో, నందమూరి అభిమానులను ఓ పెద్ద భయం వెంటాడుతోంది. ఈ సినిమా విడుదలైన కేవలం రెండు వారాలకే, ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న హాలీవుడ్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar Fire and Ash) రూపంలో పెద్ద గండం ఎదురుకాబోతోంది. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం డిసెంబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పటికే బుక్ మై షోలో రికార్డు స్థాయిలో లైక్స్‌ని సాధించడం, దీనికి ఉన్న క్రేజ్‌ను సూచిస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా తొలి రెండు వారాలు చాలా కీలకం. ‘అఖండ 2: తాండవం’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చి, థియేటర్లలో అద్భుతంగా ప్రదర్శిస్తున్న సమయంలోనే, ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మార్కెట్లోకి వస్తుంది. అందుకే ఫ్యాన్స్ భయపడుతున్నారు.
అభిమానుల్లో ఆందోళన
‘అవతార్’ వంటి భారీ చిత్రానికి థియేటర్ల లభ్యత అత్యంత ముఖ్యమైన అంశం. దీని కారణంగా, ‘అఖండ 2’ ఆడుతున్న చాలా వరకు థియేటర్లను తప్పనిసరిగా తీసేసి ‘అవతార్’కు కేటాయించాల్సి వస్తుంది. ఈ థియేటర్ల కొరత ప్రభావం ‘అఖండ 2’ కలెక్షన్లపై పడే అవకాశం ఉందని కొందరు అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మరోవైపు, కొంతమంది అభిమానులు మాత్రం ‘అఖండ 2’ మొదటి రెండు వారాల్లోనే మ్యాక్సిమమ్ కలెక్షన్లను కొల్లగొడుతుందని, కాబట్టి ‘అవతార్’ ప్రభావం పెద్దగా ఉండదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఫస్ట్ టైమ్ బాలయ్య పాన్ ఇండియా వైడ్‌గా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోన్న సమయంలో.. తెలుగు వరకు ఓకే గానీ, మిగతా భాషల్లో మాత్రం ‘అవతార్’ ప్రభావం చాలా గట్టిగా ఉండే అవకాశం లేకపోలేదు. చూద్దాం.. ఏం జరుగుతుందో? ఏదేమైనా, డిసెంబర్ 19న రాబోయే హాలీవుడ్ చిత్రం కారణంగా, తమ హీరో సినిమా కలెక్షన్లపై కొంతైనా ప్రభావం పడుతుందన్న ఆందోళన నందమూరి అభిమానుల్లో (Nandamuri Fans) స్పష్టంగా కనిపిస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
