Hyderabad sound pollution
Top Stories, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Hyderabad:బ్రాండ్ ఇమేజ్ .. ‘సౌండ్’డామేజ్

  • నగరవాసులకు నరకం చూపిస్తున్న సౌండ్ పొల్యూషన్
  • శబ్దకాలుష్యంలో దేశంలోనే 5వ స్థానంలో నిలిచిన హైదరాబాద్
  • నివాస ప్రాంతాల మధ్యే ఫంక్షన్ హాళ్ల నిర్వహణ
  • డీజేలు, బ్యాండ్ మేళా సౌండ్ లతో దద్దరిల్లుతున్న అపార్ట్ మెంట్లు
  • చిన్నారులనుంచి వృద్ధుల దాకా శబ్దకాలుష్యానికి బలి
  • పరిమితికి మించి 30-40 డెసిబెల్స్‌ అధికంగా నమోదవుతున్న శబ్ద తీవ్రత
  • కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడి
  • వాహనాలు, డీజేలు, అనవసర హారన్లే ప్రధాన కారణం

Hyderabad brand image damaged due to sound pollution


విశ్వనగరం అనుకోవడమే తప్ప హైదరాబాద్ బ్రాండ్ హోదా నానాటికీ పడిపోతోంది. ముఖ్యంగా వాహనాలు చేసే శబ్ద కాలుష్యం అంతాఇంతా కాదు. వీటికి తోడు నగరంలో ఎక్కడపడితే అక్కడ నూతన భవన నిర్మాణాల చప్పుళ్లు, ఫంక్షన్ల పేరిట లౌడ్ స్పీకర్ల హోరు, బోర్లు వేయించడం వంటి కార్యకర్మాలతో నగర పౌరులకు నిత్యం ఈ శబ్ద కాలుష్యం తప్పడం లేదు. కేంద్ర కాలుష్య మండలి (సీపీసీబీ) నివేదిక ప్రకారం 78 డెసిబెల్స్ శబ్ద కాలుష్యంతో హైదరాబాద్ దేశంలోనే 5వ స్థానంలో నిలిచింది. వాస్తవానికి ఈ శబ్దాలకు ఓ పరిమితి ఉంటుంది. పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్ లోపు శబ్దాల వరకూ ఓకే. కానీ హైదరాబాద్ శబ్ద కాలుష్యం చూస్తే డబుల్ ఉంటోంది. వాణిజ్య, పారిశ్రామికవాడలతో పోలిస్తే నివాస, సున్నిత ప్రాంతాల్లోనే రణగొణ ధ్వనులు పగలూరాత్రి అనే తేడా లేకుండా వెలువడుతున్నాయి. ఇప్పటికే వాయు కాలుష్యంతో అనారోగ్యాల బారినపడుతున్నారు నగరవాసులు.. అధిక శబ్దాలతో శిశువులు, వృద్ధులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరికొందరు గుండె జబ్బులు, బీపీ బారిన పడుతున్నారు. కొంతకాలంగా శబ్ద కాలుష్యం వల్ల కలిగే దుష్ఫ్రభావాలు కూడా వెంటాడుతున్నాయి. నగరంలో శబ్దకాలుష్యం ఈ రేంజ్‌లో ఉంటున్నా.. పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సామాన్యులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

నివాస ప్రాంతాల మధ్య ఫంక్షన్ హాళ్లు


ఒకప్పుడు నగరాలకు దూరంగా శివారు ప్రాంతాలలో పెళ్లి ఫంక్షన్ హాల్స్ ఉండేవి. జనాభా పెరగడంతో అవి కూడా జనం మధ్యకు వచ్చేశాయి. నివాస ప్రాంతాల మధ్యలోనే ఫంక్షన్ హాళ్లు..ఇక చెవులకు హోరెత్తించే డీజే సౌండ్, బ్యాండ్ మేళాలతో అపార్ట్ మెంట్ ఫ్లోర్లు అదిరే శబ్దాలు చేయడంతో నిత్య నరకం చూస్తున్నారు నగర ప్రజానీకం. రూల్స్ ఏం చెబుతున్నాయంటే రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల వరకూ సౌండ్ సిస్టమ్స్ ఉపయోగించకూడదు. అయితే పెళ్లి ముహూర్తాలు అర్థరాత్రి, తెల్లవారుజామున ఉంటే పొరుగువారికి నిద్రాభంగం కలిగించేలా శబ్దాలు వస్తుంటాయి. రాత్రి 12 గంటలు దాటినా పెళ్లిళ్ల సీజన్ లో శబ్దాలు హోరెత్తిపోతునే ఉంటాయి. వీటిపైన పర్యవేక్షణ ఉండదు. సాధారణంగా ఫంక్షన్‌ హాల్స్‌లలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది.. ఒకటి రెండు రోజులంటే చూసీచూడనట్లు ఉన్నా.. నిత్యం శబ్దాల మోత మోగుతుండటంతో ఎలా భరించాలని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొన్ని సందర్భాల్లో పోలీసులు రానే రారు.. వచ్చినా తాత్కాలికంగా నిర్వాహకులకు చెప్పి..బంద్‌ చేయించి వెళ్లడం, వెంటనే తిరిగి సౌండ్‌ సిస్టమ్స్‌ను ప్రారంభించడం జరుగుతోంది. పోలీసులకు, ఆయా ఫంక్షన్‌ హాల్‌ యజమానులకు మధ్య ఉండే సంబంధాలతోనే ఈ వ్యవహారంలో చూసీచూడనట్లు ఉంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. ఆ లేఖను కోర్టు సుమోటగా విచారణకు స్వీకరించింది.

వాహన తనిఖీలు నామమాత్రం

గతంలో తరచూ స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తూ సౌండ్‌ పొల్యూషన్‌కు కారణమయ్యే వాహనాదారులపై చర్యలు తీసుకునే వారు. నేడు ఆ పరిస్థితి లేదు. రోడ్లపై శబ్ద కాలుష్యం పెరిగిపోతున్నది. వాహనాలను తనిఖీ చేయడమే కాకుండా సైలెన్సర్లు మరమ్మతులు చేసే మెకానిక్‌లు.. హారన్లను బిగించే కార్‌ డేకార్స్‌ నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసేవారు. చట్ట ప్రకారం అది తప్పుడు అలా చేయకూడదని చెబుతూ, మాట వినని వారిపై చర్యలు కూడా తీసుకునే వారు. నేడు ఆ పరిస్థితి లేదు. అసలు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందకే ఇబ్బందిపడుతున్న ట్రాఫిక్‌ పోలీసులు, ఈ విషయాలను మర్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి.రెసిడెన్షియల్‌ జోన్‌ అయిన జూబ్లీహిల్స్‌లో ఏప్రిల్‌లో పగలు 68.71 డెసిబెల్స్‌ శబ్ద తీవ్రత నమోదవగా రాత్రివేళ 71.36 డీబీ నమోదైంది. పారిశ్రామిక ప్రాంతమైన సనత్‌నగ ర్‌లో ఉదయం 66.40 డెసిబెల్స్‌గా ఉంటే రాత్రిపూట 66.58 డీబీగా ఉంది. వాణిజ్య ప్రాంతమైన జేఎన్‌టీయూ వద్ద పగలు 67.76 డీబీ ఉండగా.. రాత్రివేళ 67.57 డీబీ నమోదైంది. అలాగే సున్నిత ప్రాంతమైన జూపార్క్‌ వద్ద ఉదయం 56.88 డీబీ నమోదవగా.. రాత్రిపూట 52.20గా రికార్డయింది. భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్ల నిరంతరం హారన్లు మోగించడం, ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద వాహనాల మోత.15 ఏళ్లకు మించిన వాహనాలు రోడ్లపై తిరుగుతుండటంతో వాటి నుంచి వచ్చే అధిక శబ్దాలు., నివాసిత ప్రాంతాల్లో ఫంక్షన్‌ హాళ్ల నుంచి లౌడ్‌ స్పీకర్లు, డీజేల హోరు., నివాస ప్రాంతాల్లో ఫంక్షన్‌ హాళ్లు, పబ్బుల ఏర్పాటుతో డప్పులు, డీజే సౌండ్లు, భవన నిర్మాణాల కోసం తవ్వకాలు, బ్లాస్టింగ్‌లు, బోర్ల తవ్వకం, భారీ కాంక్రీట్‌ మిక్సింగ్‌ యంత్రాల వినియోగం.,పరిశ్రమల కోసం జనరేటర్ల వినియోగం..ఇవన్నీ కూడా శబ్దకాలుష్యానికి కారకమవుతున్నాయి.

మొక్కుబడిగా అవగాహన కార్యక్రమాలు

నగరంలో పరిమితికి మించి నమోదవుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి (టీజీ పీసీబీ), ట్రాఫిక్‌ పోలీసులు, రవాణా, మున్సిపల్‌ శాఖలు విఫలమవుతున్నాయి. ఇతర నగరాల్లో ‘నో హాంకింగ్‌ క్యాంపెయిన్‌’ నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తుండగా మన నగరంలో ఈ తరహా కార్యక్రమాల ఊసే లేదు. భారీ శబ్దం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించడానికి పరిమితమవుతున్నారు తప్పితే వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం లేదు. వాహనాల నుంచి వెలువడే అధిక శబ్దాలు, అక్రమ ఎయిర్‌ హారన్‌లను గుర్తించి జరిమానాలు విధించేందుకు పోలీసులు నగరంలోని ప్రధాన మార్గాల్లో నాయిస్‌ డిటెక్షన్‌ ఉపకరణాలు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు