- టూరిజం కార్పొరేషన్‌లో శ్రీనివాస్ గౌడ్ ఇష్టారాజ్యం
- టానిక్‌లో బినామీగా అనుచరుడు సామా రఘుపతి గౌడ్
- ఎలాంటి పెట్టుబడులు లేకుండానే నెలకు లక్షల్లో రెంట్లు
- లీజుల అవినీతి విలువ 234 కోట్లకు పైనే!
- టూరిజం మాజీ ఎండీ మనోహర్ రావుతో తెరచాటు దందాలెన్నో
- బీఆర్ఎస్ పార్టీకి అడ్డాగా టూరిజం ప్లాజాలు
- మహబూబ్‌నగర్ పాత కలెక్టరేట్ స్థలం లీజులోనూ అవకతవకలు
- హైదరాబాద్ టు అదిలాబాద్, ఖమ్మం టు కాళేశ్వరం..
- ఎటు చూసినా, ఎక్కడ చూసినా మాజీ మంత్రి అక్రమ లీలలే
- కార్పొరేషన్‌లో కాసుల కక్కుర్తిపై ‘స్వేచ్ఛ’ స్పెషల్
Collection is The King! Silent Danda, Loans in The Name Of Benami : శ్రీనివాస్ గౌడ్.. ఉద్యోగ సంఘాలు, ఉద్యమాల పేరుతో ఎదిగిన నేతగా చెబుతారు. జీవిత ఆశయం మంత్రి కావాలని ప్రతి అవకాశాన్ని మెట్టులా వాడుకొని పైకొచ్చిన పొలిటీషియన్. కానీ, మంత్రి అయ్యాక ప్రజాసేవ ఆలోచనలు దారి తప్పాయి. పరిపాలన పేరుతో ఎంతైనా దోచుకోవచ్చు అనేందుకు నిదర్శనంగా మారరనే అరోపణలు వినిపించాయి. ఇప్పుడు అధికారం దూరం కాగానే ఆయన లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించింది. నియోజకవర్గంలో ధరణి మాటున భూములను, అభివృద్ది పేరుతో వాస్తవ లెక్కలకు నాలుగొంతలు రేట్లు పెంచుకుని టెండర్లు అనుకూలంగా వేసుకున్నారని సమాచారం. హైదరాబాద్‌లో టూరిజం శాఖలో అందినకాడికి వాడుకుని వదిలేశారని కాగ్ సాక్ష్యాధారాలతో సహా తప్పుపట్టింది.
గాలికొదిలేసిన 234 కోట్లు
టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఆ కార్పొరేషన్ పరిధిలోని ఉన్న భవంతులకు, హోటల్స్‌కి లీజ్ అమౌంట్ తీసుకొచ్చేలా ఒత్తిడి చేయలేదు. అందుకు క్విడ్ ప్రోకో ని ప్రొత్సహిస్తూ నిర్ణయాలు తీసుకున్నారని టూరిజం కార్పోరేషన్ ఉద్యోగులే అంటున్నారు. జల విహార్, దస్ పల్లా హోటల్, ఐమాక్స్, స్నో వరల్డ్, సికింద్రాబాద్ గోల్ఫ్ కోర్స్, లోయర్ ట్యాంకర్ కింద ఎక్స్పోర్టల్ హోటల్, ఇలా వీటి నుంచి పెద్ద మొత్తంలో టూరిజం శాఖకు చెల్లించాల్సి ఉంది. కానీ, చెల్లించకుండా ఉండేలా కళ్లు మూసుకుని జల విహార్‌లో భారీగా పంక్షన్స్ జరిపించారు. దస్ పల్లా హోటల్‌లో వందల మందికి భోజనాలు ఫ్రీగా పెట్టించేవారని తెలుస్తోంది. వీటన్నింటిపై కాగ్ నివేదిక సమర్పించింది. హైకోర్టులో కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ పిటిషన్ వేయగా విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతోంది.
అబ్బా.. ఏం వాడకం..!
పర్యాటక శాఖలో జరుగుతున్న అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు అనుకూలమైన ఉద్యోగులకు లక్షల్లో ఇన్సెంటివ్ పేర్లతో దొచిపెట్టారు. మంత్రి పీఏలకు, పీఆర్ఓలకు ఈ కార్పొరేషన్ నుంచే కార్లు ఇచ్చారు. బేగంపేట్ టూరిజం ప్లాజాలను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలుగా మార్చేశారు. ప్రగతి భవన్ పక్కనే ఉండటంతో అధికారుల ప్రయివేట్ మీటింగులు ఇక్కడే జరిగేవి. నిథిమ్ కాలేజీని నిర్విర్యం చేసి వందల కోట్ల స్కాం జరిగినా మంత్రి అటువైపు కూడా చూడలేదు. శేరి సుభాష్ రెడ్డి తమ్ముడు చిన్నంరెడ్డి ఛైర్మన్‌గా ఉండటమే ఇందుకు కారణం. ఇలా శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో ఉన్న టూరిజం ప్లాజాలను, హోటల్స్‌ని తక్కువ రేట్‌కి లీజులకు ఇస్తూ బినామీల పేరుతో సంపద కూడగట్టినట్టుగా కనిపిస్తోంది.
మాజీ ఎండీ మనోహర్ రావుతో ఫెవికాల్ బంధం
టూరిజం మాజీ ఎండీ మనోహర్ రావు, శ్రీనివాస్ గౌడ్‌కి మధ్య విడదీయరాని బంధం ఉంది. బోయినపల్లి వినోద్ రావుకి మనోహర్ రావు బంధువు కావడంతో ఏది చేసినా ఎవరూ అడిగేవారు లేరు. అందుకే, టానిక్‌కి దుర్గం చెరువులో ఎకో టూరిజం పార్క్ ఏరియాలో విధ్వంసం సృష్టించడానికి లైన్ క్లియర్ అయింది. 2018లో హోటల్ కమలా ఓరిస్ ఒక్కటే టెండర్లలో పాల్గొంది. ఒక్కరే పాల్గొంటే మళ్లీ టెండర్స్ పిలవాలి. కానీ, కావాలని జాప్యం చేసి టానిక్ ఎలైట్ వైన్ షాప్‌కి చెందిన ఏఏ అవొకేషన్‌కి ఇచ్చేశారు. అందుకు, మనోహర్ రావు బినామీగా అదిత్య, శ్రీనివాస్ గౌడ్ అనుచరుడు సామా రఘుపతి గౌడ్, ఈ కంపెనీలోకి డైరెక్టర్స్‌గా చేరిపోయారు. ప్రభుత్వానికి 15 లక్షల లీజు రూపంలో ఇచ్చారు. వాళ్లు మాత్రం మరో 3 ఎకరాలను కబ్జా చేసుకుని పాతిక షాపులను ఇల్లీగల్‌గా థర్డ్ పార్టీలకు అద్దెకు ఇవ్వాలని ప్లాన్ చేశారు. వీటి ద్వారా నెలకు 40 లక్షల వరకు అద్దె వస్తుంది. ఇదే కాకుండా నిర్ణయం ఆలస్యం అవడం, హెరిటెడ్ రాక్స్‌తో పాటు, చెట్లను నరికి వేసి విధ్వంసం, ఇలా 10 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వచ్చిందని అంచనా వేశారు. ఇప్పుడు కబ్జా చేసిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైకోర్టులో మరో రూపంలో పిటిషన్ వేసి మళ్లీ దక్కించుకోవాలనే ప్రయత్నం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా మహాబూబ్‌నగర్ పాత కలెక్టర్ కార్యాలయానికి బినామీలే టెండర్స్‌లో పాల్గోనేలా నిబంధనలు తయారు చేసి టెండర్స్ పిలిచారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో కొత్త పభుత్వం వాటిని రద్దు చేసింది. టూరిజంలో జరిగిన అవకతవకలపై సిట్ దర్యాప్తు చేయాలని ఉద్యోగులే కోరుతున్నారు. ఈ అక్రమాల నిగ్గు తేల్చితేనే మరోసారి రిపీట్ కాకుండా ఉంటాయని అంటున్నారు.
మహబూబ్‌నగర్‌లో ధరణి లీలలు
తెలంగాణ భూముల రిఫార్మ్స్ అంటూ తెచ్చిన ధరణి కొందరు నేతల జీవితాలనే మార్చేసింది. ఎన్ని తరాలు తిన్నా తరగని ఆస్తిని వారు సంపాదించారు. అలా శ్రీనివాస్ గౌడ్ ధరణిలో భూములు ఎక్కువ తక్కువలు అన్నీ తన అనుచరుల పేర్లపై రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెద్ద చెరవు సుందరీకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. సెంట్రల్ లైటింగ్, మొక్కల పేర్లతో మున్సిపాల్టీలో ఎక్కువ రేట్లతో పనులు చేయించారు. హైదరాబాద్ నాంపల్లిలో 60 రూపాయలకు అడుగు జాగా అద్దెకు వెళ్లే ప్రాంతంలో ట్రస్ట్ పేరుపై ప్రభుత్వం వద్ద కేవలం రూపాయికే లీజుకి తీసుకుని ప్రయివేట్ ఛానల్‌ని నడిపించారు. ఇలా 33 ఏండ్ల లీజులో 19 కోట్ల రూపాయలు హౌజింగ్ బోర్డుకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే హౌజింగ్ శాఖ దర్యాప్తు మొదలు పెట్టింది. ఇలా ఏ ఒక్కటీ వదలకుండా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన అక్రమాలను పెంచి పోషించారని విమర్శలు ఉన్నాయి. వీటన్నింటిపై దర్యాప్తునకు ఆదేశిస్తే అన్నీ బయటకు వస్తాయి. ఇందుకు సంబంధించి ‘స్వేచ్ఛ’ పూర్తి సాక్ష్యాధారాలు సేకరించింది. కాగ్ నివేదికతో పాటు, టూరిజం శాఖలో అక్రమంగా జరిగిన అగ్రిమెంట్లు సంపాదించింది.
ఎన్నికల కోడ్‌లో ప్రభుత్వ సొమ్ముతో తిరుమల దర్శనం
ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఇచ్చిన బీఫామ్‌ని పట్టుకుని టూరిజం శాఖ సొమ్ముతో తిరుమలకు వెళ్లారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆయనతో పాటు అప్పటి ఎండీ మనోహర్ రావు, ఓఎస్డీ సత్యనారయణ అధికారికంగా వెళ్లడంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా తీసుకోని వారిద్దరిని సస్పెండ్ చేసింది. ఇప్పటి వరకు ఇంకా ప్రభుత్వం పొస్టింగ్ ఇవ్వలేదు.
స్వదేశీ దర్శన్‌లోనూ 20 కోట్ల స్కాం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వదేశీ దర్శన్‌లో అంచనాలకు మించి 20 కోట్లు ఖర్చు పెట్టారు 2 కోట్లు ఎలాంటి పనులు చేయకుండానే విత్ డ్రా చేసుకున్నారు. ఈ తతంగంపై కాగ్ నివేదిక సమర్పించింది. ఎక్సైజ్ శాఖను మించి టూరిజం శాఖలో అవకతవకలకు పాల్పడినట్లు విమర్శలు వస్తున్నాయి.
– దేవేందర్ రెడ్డి, (సీనియర్ జర్నలిస్ట్)