IBomma Ravi Investigation: ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi) విచారణాధికారులకు బొమ్మ చూపించాడు. పైరసీ వ్యవహారంపై ఎన్ని రకాలుగా ప్రశ్నించినా నేనొక్కడినే అంతా చేశా అని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. బ్యాంక్ లావాదేవీల వివరాలను ముందు పెట్టి ప్రశ్నించినా.. ఎలాంటి కీలక వివరాలు వెల్లడించలేదని తెలిసింది. దమ్ముంటే పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసిరిన రవిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో రవిని కస్టడీకి తీసుకున్న సైబర్ క్రైం పోలీసులు 5వ రోజు కూడా నిశితంగా ప్రశ్నించారు. వేర్వేరు బ్యాంకుల అధికారుల నుంచి రవి జరిపిన 30 కోట్ల రూపాయల లావాదేవీల వివరాలను తెప్పించుకుని వాటిని ఎదురుగా పెట్టి ప్రశ్నించారు. రవి తన చెల్లెలు చంద్రికతోపాటు స్నేహితుడు నిఖిల్, మరికొందరికి పలుమార్లు డబ్బు పంపినట్టు నిర్ధారణ కావటంతో ఆ లావాదేవీల గురించి అడిగారు. చెల్లెలు కాబట్టే చంద్రికకు డబ్బు పంపించానని, అంతకు మించి దీంట్లో ఏమీ లేదని రవి చెప్పినట్టుగా తెలిసింది. ఇక, స్నేహితుడైన నిఖిల్‌తో కలిసి రవి టెక్నికల్ ఆపరేషన్స్, డేటా హైడింగ్, సర్వర్ యాక్సెస్ తదితర కార్యకలాపాలు నిర్వహించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్‌కు భారీ మొత్తాల్లో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశాడని భావిస్తున్న అధికారులు దీనిపై పలు ప్రశ్నలు సంధించినట్టుగా సమాచారం. అయితే, అంతా నేనొక్కన్నే చేశానంటూ రవి జవాబిచ్చినట్టుగా తెలియవచ్చింది. క్రిప్టో ద్వారా జరిపిన నగదు బదిలీల గురించి అడిగితే మౌనంగా ఉండిపోయినట్టు తెలిసింది.
Also Read- Tollywood: ‘దేవర, హరిహర వీరమల్లు, ఓజీ’.. ఈ సినిమాల పార్ట్ 2 సంగతేంటి? డౌటేనా?
5రోజులు విచారించినా…
కస్టడీకి తీసుకుని అయిదు రోజులపాటు విచారించినా (IBomma Ravi Investigation) దర్యాప్తు అధికారులు రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టలేకపోయారని సమాచారం. మొదటి రోజు వెబ్ సైట్లు, సర్వర్లు, బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో ఉన్న సంబంధాల గురించి దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. పాస్ వర్డుల గురించి అడిగారు. అయితే, తనకేమీ గుర్తు లేదని రవి చెప్పినట్టుగా సమాచారం. రెండో రోజు ఎస్‌బిఐ టర్మ్ ఇన్సూరెన్స్ వెబ్ సైట్‌లో పైరసీ సినిమాలను అప్‌లోడ్ చేయటంపై ప్రశ్నించారు. పైరసీలో నీకు సహకరిస్తున్న వారే ఈ పని చేసి ఉంటారు? వాళ్లు ఎవరు? అని అడిగితే జవాబుగా రవి అంతా నేనొక్కన్నే చేశానని జవాబు ఇచ్చినట్టుగా తెలిసింది. ఎస్‌బిఐ టర్మ్ ఇన్సూరెన్స్ వెబ్ సైట్‌లో పైరసీ సినిమాలు ఎలా వచ్చాయన్నది తనకు తెలియదని, ఆ పని చేసేవారు ఎవరో కూడా తెలియదని అన్నట్టుగా తెలియవచ్చింది. మూడో రోజు హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా రవిని ప్రశ్నించారు. దీంట్లో కూడా రవి ఎలాంటి కీలక వివరాలు వెల్లడించలేదని తెలిసింది. దాంతో ఎథికల్ హ్యాకర్ల సహాయంతో రవి ఏర్పాటు చేసుకున్న సర్వర్లు, వెబ్ సైట్ల వివరాలను తెలుసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇక, నాలుగో రోజు నగదు లావాదేవీలు, ఐపీ అడ్రసులు, విదేశాలతో పాటు ఇక్కడ ఎవరెవరు సహకరిస్తున్నారన్న దానిపై ప్రశ్నించినా రవి పనికి వచ్చే ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిసింది. ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో కొన్న డొమైన్ల వివరాల గురించి అడిగితే మరిచిపోయా అని జవాబు ఇచ్చినట్టు సమాచారం.
Also Read- Dharmendra Deol: బాలీవుడ్ హీ-మ్యాన్ ధర్మేంద్ర గురించి ఈ విషయాలు తెలుసా? టాలీవుడ్ నివాళి..
మిగతా కేసుల్లో…
రవిపై ప్రస్తుతం 5 కేసులు నమోదు కాగా ఒక్క కేసులోనే అతన్ని అరెస్ట్ చేశారు. మిగతా కేసుల్లో కోర్టుకు పీటీ వారెంట్లు దాఖలు చేశారు. నేడో రేపో మిగతా కేసుల్లో కూడా అతని అరెస్ట్ చూపించనున్నట్టు తెలిసింది. ఆ తరువాత మరోసారి కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని రవిని ప్రశ్నించాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. రవి కస్టడీకి కోర్టు మరోసారి అనుమతి ఇచ్చేలోపు మరిన్ని ఆధారాలు సంపాదించి వాటిని ముందు పెట్టి.. రవి నోరు తెరిపించాలని అధికారులు భావిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
