Dharmendra: బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర నవంబర్ 24, 2025 సోమవారం ఉదయం 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. కొద్ది రోజుల క్రితం డిశ్చార్జ్ అయి ఇంటిలోనే వైద్యం పొందుతుండగా, ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.
ముంబై జుహులో ఉన్న బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర నివాసం వద్ద ఈ రోజు అంబులెన్స్ కనిపించడంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన చెలరేగింది. 89 ఏళ్ల ధర్మేంద్ర ఆరోగ్యం గురించి ఇప్పటికే టెన్షన్‌లో ఉన్న అభిమానులు, అంబులెన్స్ వీడియో బయటకు రావడంతో టెన్షన్‌కు గురయ్యారు.
బాలీవుడ్ అప్డేట్‌లను ఇచ్చే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన వీడియోలో, అంబులెన్స్ ధర్మేంద్ర ఇంటి ముందు చేరుకోవడం, తర్వాత మెడికల్ టీమ్ వాహనం నుంచి ఇంట్లోకి వెళ్లడం స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కావడంతో, ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించిందా? అనే అనుమానాల గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర
గమనించాల్సిన విషయం ఏంటంటే, ధర్మేంద్ర అక్టోబర్ 31 నుంచి చికిత్స పొందుతూ, ఈ నెల మొదట్లో ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అప్పట్లో కుటుంబ సభ్యులు ఆయన ఇంట్లోనే కోలుకుంటారని, అవసరం లేని ఊహాగానాలు చేయొద్దని, అభిమానుల మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.

