Betting Apps Case: బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల కేసులో సీఐడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ తన విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే హీరోలు విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాశ్ రాజ్, యాంకర్ విష్ణుప్రియ, సిరి హనుమంతు నుంచి వాంగ్మూలాలు సేకరించిన అధికారులు, హీరోయిన్లతో సహా పలువురు సెలబ్రిటీలను పిలిపించి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. సిట్ ఎదుట హాజరైన వారిలో హీరోయిన్ నిధి అగర్వాల్, మోడల్ అమృత చౌదరి, యాంకర్ శ్రీముఖి ఉన్నారు. పలువురి ఆత్మహత్యలకు కారణమై, ఎన్నో కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చిన బెట్టింగ్ యాప్‌లపై మొదట పంజగుట్ట, మియాపూర్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆ తరువాత వీటిని సీఐడీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్‌కు బదిలీ చేశారు. కేసులో నిందితులుగా ఉన్న అందరినీ వరుసగా పిలిపిస్తూ సిట్ అధికారులు వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు.
Also Read: Betting Apps Case: ఈడీ విచారణకు సమయం కోరిన రానా.. భయపడుతున్నాడా?
మీకు తెలియదా?
ఈ క్రమంలోనే జీత్ విన్ సైట్‌ను నిధి, ఎం88 యాప్‌ను శ్రీముఖి, యోలో 247, ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్‌లను అమృత ప్రమోట్ చేశారు. వీరిని శుక్రవారం సీఐడీ కార్యాలయానికి పిలిపించి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం తప్పు అని మీకు తెలియదా? అని అధికారులు వారిని ప్రశ్నించినట్టు తెలిసింది. దీనికి ముగ్గురూ తమకు ఆ విషయం తెలియదని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. అనంతరం, ఆయా బెట్టింగ్ యాప్‌లతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ పత్రాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెమ్యూనరేషన్‌గా ఎంత డబ్బు తీసుకున్నారు? చెల్లింపులు ఎలా జరిగాయి? నగదు రూపంలో ఇచ్చారా? లేదా బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారా? అన్న సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించారు.
Also Read: Betting Apps Case: బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరైన మంచు లక్ష్మీ ప్రసన్న
