Tollywood: టాలీవుడ్ సినీ పరిశ్రమలో సినిమా ప్రచారం (పబ్లిసిటీ) తీరు నెమ్మది నెమ్మదిగా మారుతోంది. ఒకప్పుడు భారీ ఈవెంట్లు, అగ్ర తారల అతిథి ప్రసంగాలు మాత్రమే లో బడ్జెట్ సినిమాలకు హైప్ తెచ్చేవి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో సెలబ్రిటీ గెస్ట్‌ల అవసరం లేకుండానే (పిలిచినా వారు రావడం లేదని ఈ మధ్య నిర్మాతలు కొందరు కంటతడి పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయిలే) సినిమాను జనంలోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు, సినీ విమర్శకులు కొత్త ‘స్టార్ పబ్లిసిటీ’గా అవతరిస్తున్నారు. ఇటీవలి కాలంలో, చిన్న సినిమా నిర్మాతలు తమ చిత్రాలను మీడియాకు, సినీ విమర్శకులకు ప్రత్యేకంగా ప్రదర్శించడం ఒక బలమైన ట్రెండ్‌గా మారింది. గతంలో వారం రోజులు ఆలస్యంగా రివ్యూలు (Movie Reviews) ఇచ్చేవారికి, ఇప్పుడు సినిమా విడుదల తేదీకి ముందే షోలు వేసి, వారి తక్షణ అభిప్రాయాలను స్టేజ్‌పై పంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ మీడియా టాక్ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడం ద్వారా, సినిమాపై హైప్ క్రియేట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Also Read- Akhanda 2 Trailer: ‘అఖండ 2: తాండవం’ మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే..
జర్నలిస్టుల మాటలే వైరల్ అస్త్రం
తక్కువ బడ్జెట్‌తో తీసిన చిత్రాలకు, కోట్లలో ఖర్చు చేసే పెద్ద హీరోల పబ్లిసిటీ అందుబాటులో ఉండదు. ఈ నేపథ్యంలో, సీనియర్ జర్నలిస్టుల (Cinema Journalists) యొక్క నిర్మొహమాటమైన సమీక్షలు, విశ్లేషణలు బడ్జెట్ కొరతను సమర్థవంతంగా అధిగమిస్తున్నాయి. ఒక జర్నలిస్ట్ ఇచ్చే పాజిటివ్ రివ్యూ లేదా హిట్ బొమ్మ అనే మాట, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో.. అగ్ర తార ఇచ్చిన ఆల్ ది బెస్ట్ కంటే పది రెట్లు ప్రభావం చూపుతోంది. ఈ ఫార్ములా అనేక చిన్న సినిమాలకు అద్భుతమైన విజయాన్ని అందించిందనేది, ఈ మధ్య వస్తున్న చిన్న సినిమాలను గమనిస్తే తెలుస్తోంది. కాకపోతే, ఈ పబ్లిసిటీ విధానంలో కొన్ని వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొందరు జర్నలిస్టులు పబ్లిసిటీ ఈవెంట్లలో అతిగా మాట్లాడటం, లేదా అనవసరమైన కామెంట్స్ చేయడం వల్ల జరిగే చిన్నపాటి వివాదాలు కూడా, ఉద్దేశించిన దానికంటే ఎక్కువ పబ్లిసిటీని తెచ్చిపెడుతుండటం గమనార్హం. ‘కాంట్రవర్సీ ఈజ్ పబ్లిసిటీ’ అనే సూత్రాన్ని కొందరు నిర్మాతలు తెలివిగా ఉపయోగించుకుంటున్నారు.
పబ్లిసిటీ పాత్ర మారుతోంది
ఈ పరిణామం టాలీవుడ్‌లో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. సినిమా ప్రచారంలో ఇకపై స్టార్ పవర్ కంటే కంటెంట్ పవర్, దానిని జర్నలిస్టులు ప్రజలకు చేరవేసే విధానానికే అధిక ప్రాధాన్యత లభిస్తోంది. మొత్తంగా చూస్తే, లో బడ్జెట్ చిత్రాల విజయానికి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జర్నలిస్టులు, సినీ విమర్శకులు ఒక అనివార్యమైన, శక్తివంతమైన మాధ్యమంగా మారుతున్నారు అనడంలో సందేహం లేదు. ఈ ట్రెండ్ రాబోయే కాలంలో మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించిన ఈ రోజుల్లో.. చిన్న చిత్రాల నిర్మాతలు ఏదో ఒకటి, ఇలా ప్లాన్ చేయక తప్పడం లేదు. మరి ముందు ముందు ఇది ఎంత వరకు వెళుతుందనేది మాత్రం చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
