NHM Staff Protest: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎమ్) ఉద్యోగులు (Employees) జీతాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొందరికి రెండు, మరికొందరికి మూడు, నాలుగు నెలల నుంచి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, కొన్ని జిల్లాల్లో అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు ఉద్యోగులు (Employees) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులకూ వేతనాలు అందలేదు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఉద్యోగులు చెప్తున్నారు. బడ్జెట్ లేకపోతే తామేమీ చేయగలమని ఉన్నతాధికారులు చెప్తున్నారని, దీనిపై ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
17 వేల మందికి పైగా చిక్కులు
నేషనల్ హెల్త్ మిషన్‌లోని వివిధ ప్రోగ్రామ్‌లు, స్కీమ్స్‌లో సుమారు 17,514 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానాల్లో పనిచేస్తున్నారు. 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పనిచేసే ఉద్యోగులంతా పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచే ఎక్కువ మంది ఉన్నందున, సకాలంలో జీతాలు అందకపోవడంతో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి స్టేట్ హెడ్ ఆఫీస్ వరకు వివిధ ప్రోగ్రామ్‌లలో పనిచేస్తూ ఆరోగ్యశాఖను సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకువెళ్లడంలో పాత్ర పోషిస్తున్న తమకు జీతాలు ఇవ్వకపోవడం దారుణమంటూ ఎంప్లాయిస్ అసోసియేషన్లు మండిపడుతున్నాయి.
కోఠిలో ధర్నా..
జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, ఏఐటీయూసీ, నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం కోఠి ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం క్యాంపస్‌లో ధర్నా కూడా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని, అంతేగాక ప్రతి నెల 1న వేతనాలు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నాయకులు రుక్మిద్దిన్, డా. భరత్, డా. నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి నర్సింహా మాట్లాడుతూ, జీతాల జాప్యంలో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని ఆరోపించారు. జీతాల కోసం కార్యాలయాల చుట్టూ కావాలని తిప్పించుకుంటున్నారని, ఉద్యోగులకు బేసిక్ వేతనంతో పాటు ఏడు నెలల పీఆర్సీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Also Read: Singareni Employees: గుడ్ న్యూస్.. సింగరేణి ఉద్యోగులకు ప్రమోషన్లు!

