Formula E Race Case: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈ కేసులో విచారణ చేపట్టేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఫార్ములా ఈ – కారు కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులకు కేటీఆర్ ను విచారించేందుకు మార్గం సుగమం చేశారు. గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే కేటీఆర్ పై చార్జ్ షీట్ ను దాఖలు చేసే అవకాశముంది.
కేటీఆర్‌పై ఆరోపణలు ఏంటంటే?
గత బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లో ఫార్మూల ఈ-కారు రేసు జరిగింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందంటూ కేటీఆర్ పై ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో ఏసీబీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. కేటీఆర్ ను ఏ-1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ-2గా చేర్చారు.
4 సార్లు కేటీఆర్ విచారణ
దర్యాప్తులో భాగంగా కేటీఆర్ ను ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. అటు అరవింద్ కుమార్ సైతం ఐదుసార్లు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కేటీఆర్ పాత్రకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈ-మెయిల్స్ ను, ఎలెక్ట్రానిక్ సాక్ష్యాలను, ఇతర సాక్ష్యాలను ఏసీబీ సేకరించింది. తొమ్మిది నెలల పాటు పకడ్బందీగా అన్ని కోణాల నుండి విచారణ జరిపింది.
సీఎం రేవంత్ ఒత్తిడి వల్లే!
అయితే ఎమ్మెల్యే అయిన కేటీఆర్ ను ప్రొసిక్యూట్ చేయాలంటే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న ఆయన అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు లేఖ రాశారు. అయితే దీనిపై చాలా రోజుల వరకూ గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడం రాజకీయంగానూ మాటల యుద్ధానికి దారి తీసింది. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి.. ఈ విషయాన్ని లేవనెత్తి బీఆర్ఎస్ – బీజేపీ మధ్య ఉన్న తెరవెనుక మైత్రికి ఇది నిదర్శమని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే 10 వారాల తర్వాత కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.
Also Read: CM Revanth Reddy: దేశానికి బలమైన నాయకత్వం ఇందిరా గాంధీ.. మహిళా శక్తి చీరల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి
త్వరలోనే చార్జ్ షీట్ దాఖలు!
మరోవైపు ఐఏఎస్ అధికారి అయిన అర్వింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు DoPT అనుమతి సైతం ఏసీబీ కోరింది. ఆ అనుమతి కూడా రాగానే కేటీఆర్, అరవింద్ కుమార్, మరో నిందితుడు బీఎల్ఎన్ రెడ్డిలపై చార్జ్ షీట్ దాఖలు చేసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
